మాట

wordమాట మన భావ వ్యక్తీకరణకు ఓ చక్కని మార్గం. మన దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికి ముఖ్యమైన మాధ్యమం మాట. నిజానికి మన ఆలోచనా విధానం, ప్రవర్తన ఎలా ఉంటాయనేది మాటల ద్వారానే తెలుస్తుంది. అందుకే వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. కొంత మంది ఆలోచించి మాట్లాడితే, మరికొందరు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. అందుకే ‘ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడవలసిన అవసరం ఉందా’ అని ఆలోచించుకుని మాట్లాడాలంటారు ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్‌.
‘మాటలే కదా.. ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుందిలే’ అనుకోవడానికి లేదు. మనం అనుకునేదాని కంటే వీటిల్లో చాలా శక్తి ఉంటుంది. పదునైన మాటలు ఎదుటి వారి మనసును గాయపరచడమే కాదు… వారి ఆత్మ గౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీయగలవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రోజూ మన చుట్టూ ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో అన్నీ సంతోషాన్ని పంచేవే ఉండవు కదా. నచ్చనవీ ఉండొచ్చు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయడం తప్పుకాదు. కానీ అదే అదునుగా తీసుకుని మాటల తూటాలతో ఇతరుల మనసును ఛిద్రం చేయకూడదు. ఎదుటి వారి మనసు నొచ్చుకోకుండా.. అదే సమయంలో వాళ్ల పొరపాటు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది కాస్త కష్టమేకానీ ఆచరించాలనుకుంటే అసాధ్యమేమీ కాదు.
మాటల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా సందేహరహితంగా ఉండాలి. లేకపోతే అపార్థాలకు దారి తీసి సంబంధాలు దెబ్బతింటాయి. మాటే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. అదే మాట సమస్య నుండి మనల్ని బయటపడేస్తుంది. కనుక చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలి. మిత్రులు, సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా, పెద్దలతో వినయంగా, పిల్లలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. అతి ఎప్పుడూ ఎక్కడా పనికి రాదని గుర్తుంచుకోవాలి. మాటకు విలువలేని చోట, మనోభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనం ఉత్తమం. మరో విషయం ఏమిటంటే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే సరైన మార్గం. వివేచన లేని వాగ్వివాదాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి.
నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం. వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు. మంచిగా, పద్ధతిగా మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా తెలియాలి. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునావృతం అవుతుంది. వింటుంటే కొత్త విషయాలు, ఇతరుల అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి. అంతేకాకుండా ఎదుటి వారు ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే, మాట్లాడేవారి అంతరంగాన్ని చిత్తశుద్ధిని కూడా గ్రహించగలగాలి. వినేటప్పుడు పెద్దల భావాలు పరిగణనలోకి తీసుకోవాలి. కటువుగా ఉన్నా హితుల మాటలు స్వీకరించాలి. వినే విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటూ మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా, మృదువుగా, చిరునవ్వుతో వ్యక్తం చేస్తే సమాజంలో సంబంధాలు సాఫీగా సాగిపోతాయి.

Spread the love