యువత బంగారు భవిష్యత్తుకు శాయశక్తులా కృషి

– పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – రాయపర్తి
యువత బంగారు భవిష్యత్తుకు శాయశక్తులా కృషి చేస్తున్నాను అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ జారి ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏ ప్రభుత్వం చేయలేదనేది జగమెరిగిన సత్యం అని వ్యాఖ్యానించారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీని చేసింది శూన్యం అని  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీళ్లు, నిధులు, అభివృద్ధి చేస్తే ఎవరు వద్దు అన్నారు అని దుయ్యబట్టారు. కేసీఆర్ సాగు నీరు, త్రాగు నీరు, కరెంట్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, సబ్సిడీ ఎరువులు, మన ఊరు మన బడి వంటి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేశారు అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి అన్నారు. కరోనాలో సొంతగా 5కోట్ల రూపాయలతో ఆనందయ్య మందు, నిత్యావసర వస్తువులు నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు చేశాను అని తెలిపారు. మండలానికి అంబులెన్స్ ఇచ్చాను అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఎంతటి కష్టమైన పడతా అన్నారు. మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ  ఇచ్చాము అని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇస్తున్న డబ్బులతో ప్రజలకి సేవలు అందిస్తున్న అని పేర్కొన్నారు. నాలుగు కోట్లు ఖర్చు చేసి యువతకు డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తున్న అన్నారు. వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండలనేదే నా లక్ష్యం అన్నారు. హెల్మెట్లు కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్టీఓ ఆఫ్రిన్ సిద్ధికి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఎంపీడీఓ కిషన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love