ఏ తప్పు చేయలేదు..మీ కమిషనే డొల్ల

ఏ తప్పు చేయలేదు..మీ కమిషనే డొల్ల– విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?
– జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌పై మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణాల్లో ఎలాంటి తప్పులు జరగలేదనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విచారణ కమిషన్లు వేసిందని మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. పై అంశాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌కు ఎలాంటి విచారణ అర్హతలు లేవన్నారు. జస్టిస్‌ నర్సింహారెడ్డిపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవనీ, తెలంగాణ వ్యక్తిగా ఆయన్ని గౌరవిస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తీరులో మార్పు వచ్చిందనీ, అంధకారంలో ఉన్న తెలంగాణలో వెలుగులు నింపిన మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేశారని విమర్శించారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చేందుకు గడువు కోరితే కుదరదంటూ, ఈనెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించిందన్నారు. దీనితో కేసీఆర్‌ అన్ని వివరాలతో కమిషన్‌కు లేఖ రాసారని తెలిపారు. కమిషన్‌ తన పరిధిని దాటి వ్యవహరించిందనీ, జస్టిస్‌ నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తేలిపోయిందన్నారు. అలాంటప్పుడు ఆయన ఎదుట ఏం చెప్పినా ప్రయోజనం లేదని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంపై అప్పటి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)లో పిటీషన్‌ దాఖలు చేశారనీ, తీర్పు వచ్చాక దానిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అప్పుడు మౌనంగా ఉండి, ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు రాజకీయ కక్షతో విచారణల పేరుతో గత ప్రభుత్వ గొప్పతనాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచారణ కమిషన్‌ బాధ్యతల నుంచి జస్టిస్‌ నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌పై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. విద్యుత్‌ కొనుగోళ్లపై తాము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలకు శాసనసభలోనే సమాధానాలు ఇచ్చామనీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణ సమాచారం అక్కడే ఇచ్చామని వివరించారు. మళ్లీ ఇప్పుడు విచారణ కమిషన్ల పేరుతో వేధిస్తున్నారని ఆక్షేపించారు. ‘జస్టిస్‌ నర్సింహారెడ్డి మీడియా సమావేశాల్లో మాట్లాడటం తప్పు. ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి, ఆయన మాజీ సీఎం, గత ప్రభుత్వ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన విచారణాధికారిగా అర్హత కోల్పోయారు’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల మధ్య జరిగే ఒప్పందాల్లో ఏం అవినీతి ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ కంటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్‌ను కొన్నాయని ఉదహరించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ పెద్దల్ని కూడా విచారణకు పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Spread the love