ఇస్రో సైంటిస్టుపై యువకుడి దాడి..

– బెంగళూరులో కార్యాలయానికి వెళ్తుండగా…
నవతెలంగాణ-హైదరాబాద్‌: బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీపై కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్‌ లంబా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే ఆఫీసుకు వెళుతుండగా స్కూటీపై ఓ యువకుడు నిర్లక్ష్యం గా ప్రయాణిస్తూ తన కారును అడ్డగించాడని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కారును తన్నుతూ దాడికి యత్నించాడని ఆరోపించారు. కారులో తనతో పాటు తన కొలీగ్స్‌ కూడా ఉన్నారని చెప్పారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌ గా మారింది. సైంటిస్టుపై దాడికి ప్రయత్నించిన యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వివరించారు. వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిశ్‌ లంబాను రిక్వెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Spread the love