యువత – గ్రంథాలయాలు

Crude, Rude Nudeగత సంవత్సరమా, మరుసటి సంవత్సరమా, క్రికెట్‌ సీజనా, ఎండాకాలమా, వానాకాలమా చలికాలమా అనే సీజన్‌ సినిమా లకు ఉండదు. ఎప్పుడైనా నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇదే మోజు నేటి యువతకు గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల నూటికి రెండు మూడు వంతులైనా లేదని బాధపడాల్సివస్తుంది.
చలనచిత్రాలను అభిమానించరాదని, ప్రేమించరాదని కాదు. సినిమా ఒక ప్రభావితమైన మాధ్యమం. అది అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది.
నా బాధ ఒక్కటే… గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారే అని! ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రముఖ స్టార్ల (ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ) సినిమాలు నవల నుంచి స్వీకరించబడి చేయబడ్డవే కదా… 1982-2000 కాలంలో ఒక స్టార్‌ కథానాయకుడి సినిమాలు (చిరంజీవి) ఒక నవలా రచయిత నుండి వెలుబడిన కథలు (యండమూరి వీరేంద్రనాథ్‌) దాదాపు అన్ని సినిమాలూ ప్రజాధరణ పొందినవే. అవన్నీ గ్రంథాలయంలో లభించే నవలల ఆధారితమే అని మర్చిపోకూడదు. అంటే సినిమాలు తీసే డైరెక్టర్లు, రచయితలు కూడా గ్రంథాలయాలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
మన రాష్ట్రం, దేశంలోనే కాదు, దేశ విదేశాలలో ఉత్తమోత్తమ చలనచిత్రాలు అనేకం గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఆధారంగా చేసుకుని తీసినవే. అంతెందుకు నేడు అనేక సినిమాలు బయోగ్రఫీలుగా మన ముందుకు వస్తున్నాయి. ఈ బయోగ్రఫీ సినిమాలన్నీ కూడా వారి జీవిత చరిత్ర పుస్తకాలనుండి ఎంచుకోబడ్డాయే కదా.
అయితే గ్రంథాలయాల ప్రయోజనం సినిమాలకే పరిమితం కాదు. ప్రపంచాన్ని, మానవ జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, విజ్ఞానాన్ని అందించడానికి సకల సమాచార కేంద్రంగా ఉపయోగపడుతుంది.
ముముక్షువు దేవాలయానికి వెళ్తాడు. విజ్ఞాన చక్షువు గ్రంథాలయానికి వెళ్తాడు. చలనచిత్ర శత దినోత్సవం నాడో, షూటింగ్‌ నాడో, షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం నాడో తమ సినిమా స్టార్‌ దర్శనార్థం పడిగాపులు కాస్తే… సదరు స్టార్లు నీ వంక కనీసం చూడకపోగా పోలీసు లాఠీ దెబ్బలు ఒకటో అరో వడ్డిస్తారు. అదేవిధంగా సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు, సినీ కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా చేసే హడావుడి, పడే అగచాట్లు మనం చూస్తూనే వున్నాం.
అదే గ్రంథాలయం కోసమో, కొత్త పుస్తకాల కోసం ఎదురు చూడడం, హడావుడి చేయడం, లైబ్రరీ ఎక్కువకాలం తెరిచి ఉంచమని (చదవడం కోసం) విజ్ఞప్తులు చేస్తున్నామా? అలాంటిదేమీ వుండదు కదా!
హోటల్‌ దగ్గర, కూడలి దగ్గర, బస్సులలో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఫలానా సినిమా బాగా ప్రజాదరణ పొందిందని, ఆ చిత్రంలోని నటీనటుల గురించి బాగా చర్చిస్తాం. అలానే గ్రంథాలయానికి ఓ కొత్త పుస్తకం వస్తే పుస్తకంలోని క్యారెక్టర్ల గురించి, పుస్తకం యొక్క కంటెంట్‌ గురించి, పుస్తకంలో ఉన్న వ్యక్తుల గురించి, రచయిత గురించి కూడలిలో, ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులలో, రైళ్లలో చర్చ జరపాల్సిన స్థాయికి వెళ్ళాలి మనం.
2022 లెక్కల ప్రకారం 14 సంవత్సరాల లోపు పౌరులు 25.31 శాతం ఉన్నారు. 15 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల పౌరులు 67.8 శాతం ఉన్నారు. 65 సంవత్సరాల పైబడినవారు 6.9శాతం ఉన్నారు.
సినిమా హాల్స్‌ వద్ద, సినిమా షూటింగులు సందర్భంగా వేలమంది యువకులను మనం చూస్తూ ఉంటాం. పౌర గ్రంథాలయాలలో తొంగి చూస్తే పట్టుమని పదిమంది కూడా కనపడతలేరు.
ప్రతి పట్టణ ప్రాంతాలలో కనీసం ఒకటి రెండు మాల్స్‌, థియేటర్లు ఉంటాయి. గ్రామాలలో కూడా టీవీలకు అన్ని రకాల డిష్‌ నెట్వర్క్‌లు, ఓటీటీలలో సినిమాలను, వివిధ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రోగ్రాముల్ని చూస్తున్నారు. అంటే సినిమాలు థియేటర్ల నుండి ఇంటికి మారాయి. కానీ పట్టణ ప్రాంతాలలో ఒకటి రెండు గ్రంథాలయాలైనా ఉన్నాయా? ఉంటే గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య ఎంత? గ్రామాలలో గ్రంథాలయాలు ఉన్నాయా? ఉంటే ఉపయోగించుకునే వారు ఎంతమంది?
గ్రంథాలయాల సంస్కృతి, పట్టణ ప్రాంతాలలోనే ఉన్నదా? గ్రామీణ ప్రాంతాలలో లేదా? అడపా దడపా ప్రైవేటు గ్రంథాలయాలు స్థాపించబడినప్పటికీ వాటి వీక్షకుల సంఖ్య ఎంత? ఒకవేళ ఉన్నా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారే. ఈ గ్రంథాలయాల సంస్కృతి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకి వచ్చే సంస్కృతికి మనం ఎదగలేమా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత దఫా 80 వేల ఉద్యోగాలు ప్రకటనార్దం, ఈ దఫా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిన సందర్భంగా ఉద్యోగాలకు సన్నద్ధమవుతూ పుస్తకాలతో కుస్తీ పట్టేవారు అడపా తడపా గ్రంథాలయానికి వస్తుంటారు. వారి సంఖ్య కూడా బహు స్వల్పం. గ్రంథాలయం ఏ ఒక్క పోటీ పరీక్షలకో, న్యూస్‌ పేపర్లకో, మ్యాగజైన్‌ కోసమో కాకుండా అన్ని వర్గాల వారు (బాలలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, వయోజనులు, వృద్ధులు) ఉపయోగించుకునేందుకు గ్రంథాలయానికి విచ్చేస్తుంటారు.

మనం అదే గ్రంథాలయానికి వెళ్తే…
బెల్‌ రింగ్‌ చేయగానే భవభూతి ప్రజెంట్‌ ప్లీజ్‌ అంటారు. ఇదిగో అనగానే నన్నయ, తిక్కన. Hullo అనగానే హోమర్‌, జస్ట్‌ ఎ వర్డ్‌ అనగానే షేక్స్‌పియర్‌, నమస్తే అంటంతో కాళిదాసు, వందనం అనగానే వాల్మీకి, నమస్కారము అనగానే శ్రీ నాథుడు, సుప్రభాతం అనగానే శంకర స్వామి,Respond చేసి shelf లోంచి దూకి వీపు తట్టి At Your Service అంటారు. నీ మెదడుకు మేత వేస్తారు. ఆ చక్కటి పుస్తకాల చెంత సేద తీరుతారు.Only thing is you have to sit at the feet of great masters of the  past in literature, history, culture and great civilization గ్రంథాలయమనగానే నలుగురు వచ్చి కూర్చొని నాలుగు పుస్తకాలు ఉండడం మాత్రమే అనుకోవడం పొరపాటు.
పుస్తకాల రూపంలో దాగి ఉండే కొన్ని లక్షల మంది మేధావుల, దార్శనికుల, కళా శ్రేష్టల, వైజ్ఞానిక శాస్త్రవేత్తల, చరిత్రకారుల, రచయితల మనోభావాలు ఉంటాయి.
నిజానికి గ్రంథాలయం కొన్ని లక్షలమంది గురుదేవులకు, మేధావులకు నిలయమది. గ్రంథాలయాల బీరువాలలో ఉద్ధండులున్నారు. ట్యూషన్‌ ఫీజు ఆశించకుండా ప్రౌడ వాగ్గుంబన, కవితా కమనీయకం, సుకుమార బావు కథ, కల్పనా చతురత, పదప్రయోగ నిపుణత, పద్య నిర్మాణ కుశలతల్లో తర్ఫీదు యిస్తారు. హాజం వదలి నిజం గుర్తించి నమ్రతతో ఆ మహామహుల వద్ద కూర్చోవాలి.Reverent study చేస్తే treasure house of wisdom కవాటాలు magical  తెరవబడతాయి.
రస్కిన్‌ మహాశయుడు ఏమని సెలవిచ్చాడంటే No wealth will bribe,no name overame, no artifice deceive the guardian of the elisan gates. Gold digging లాంటి శ్రమ అవసరం. Crude, Rude Nude కవిత్వం కాదు, ఆలోచనలు కాదు. అది నైతిక పతనానికి షార్ట్‌ కట్‌…. గ్రంథాలయాలను అందులో ఉన్న పుస్తకాలను, అందులో ఉన్న జ్ఞానాన్ని తదేకంగా స్వీకరిస్తే సత్‌ విలువలు కలిగిన పౌరులుగా, యువత తయారయి సత్‌ ఆలోచనలు, సత్‌ సాహిత్యం, సత్‌ ప్రవర్తన, సత్‌ మార్గం వంటి జ్ఞానవంతమైన సమాజానికి బీజాలు వేయవచ్చు.
నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నా మటుకు నాకు ఏదైనా గ్రంథాలయంలో పాదం పెట్టగానే కానవచ్చేవి పుస్తకాల వరుసలు కావావి భుజాలను రాసుకుంటూ వాల్మీకి సరసన హొమర్‌, కాళిదాసు సరసన షేక్స్‌పియర్‌, బుద్ధుని సరసన సోక్రటీస్‌, ఆర్యభట్ట సరసన న్యూటన్‌ ప్రభతులే.. మన విజ్ఞానం, కళలు, సాహిత్యం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నాగరికత, విలువలు మన పెద్దలు పెట్టిన పెట్టిన బిక్షనే. వీరిని శుశ్రూష చేయనిదే, వీరు రాసిన పుస్తకాల అవపోస పట్టనిదే, వారి సిద్ధాంతాలను, ఆశయాలను ఆచరించకపోతే మనం ఏమీ నేర్వలేం. ఒక అడుగైనా ముందుకు వేయలేం. విజ్ఞాన పదాన నడవలేం. మనం ఒక గొప్ప చరిత్రకారులుగా, కవులుగా, సాహిత్యకారులుగా, కళాకారులుగా, మేధావి గా, రచయితగా, శాస్త్రవేత్తగా ఎదగాలంటే గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాలను శుశ్రూష చేయాల్సిందేగా మరి. ఈ దృష్టితో యువకులు గ్రంథాలయాలను అంతకంత హెచ్చుగా చూడగలరని ఆ గ్రంథాలయంలో ఉన్న జ్ఞాన పుస్తకాలను అవపోసపట్టాలని ఆశిద్దాం.
ఒక సినిమా ప్రజాదరణ పొందాలంటే (హిట్టు లేదా ఫట్టు) మెజారిటీ ప్రాధాన్యత యువకులదే. ఒక గ్రంథాలయం చదువరుల ఆధరణ పొందాలంటే మెజార్టీ యువకులు ప్రాధాన్యత ఉండాలి. అంటే ఇక్కడ ప్రస్తుత కాలంలో యువకులు గ్రంథాలయానికి వస్తున్నారు, కానీ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మాత్రమే. ఇది మంచి పరిణామం కాదు. యువకులు గ్రంథాలయానికి మరలాలి. పోటీ పరీక్షల, అకడమిక్‌ పుస్తకాలే కాకుండా, నవలలు, కథలు, జీవిత చరిత్రలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలు.. ఇలా సకల విజ్ఞాన సంపదను అందిపుచ్చుకోవాలి.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

Spread the love