జక్కలొద్దిపై జులుం

Zulum on jakkalloddi– గుడిసెవాసులకు బెదిరింపులు
– వారిపై బలవంతంగా గులాబీ కండువాలు
– పక్క నియోజకవర్గంలో ‘నన్నపనేని’ జోక్యంపై చర్చ
– తతంగం వెనుక భూదందా!
– 17 నెలలుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూపోరాటం
– ఇటీవల నేతలపై దాడి.. దుష్ప్రచారం
వరంగల్‌ తూర్పు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపనేని నరేందర్‌ జక్కలొద్ది గుడిసెవాసులపై జులుం ప్రదర్శిస్తున్నారు. పేదలపై ఆయన అరాచకీయాలు బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది. జక్కలొద్దిలో 17 నెలలుగా సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో భూపోరాటం జరుగుతోంది. ప్రభుత్వ అణచివేతలకు సైతం బెదరక పేదలు సాగిస్తున్న పోరాటమది. అలాంటి పేదలపై, సీపీఐ(ఎం) నేతలపై ఎమ్మెల్యే ‘నన్నపనేని’ అనుచరులు దాడి చేసి గుడిసెవాసులను బెదిరించి గుడిసెలపై గులాబీ జెండాలు ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. జక్కలొద్ది ‘తూర్పు’ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతం కాకపోయినా ‘నన్నపనేని’ అనుచరులు, రియల్‌ ఎస్టేట్‌వ్యాపారులు జక్కలొద్దిలో రంగప్రవేశం చేయడం గమనార్హం.
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
17 నెలలుగా పేదలు సీపీఐ(ఎం) అండగా భూపోరాటం చేస్తున్నా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ రాలేదు, ఎలాంటి హామీ సైతం ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జక్కలొద్ది పేదలపై ఓట్ల రాజకీయాలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. పైగా సీపీఐ(ఎం) నేతలపై దుష్ప్రచారం చేసి వారిపై దాడి చేయించడం, గుడిసెవాసులను బెదిరించి వారి ఇండ్లపై గులాబీ జెండాలు ఎగురవేయడం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. గతంలో ఇదే నన్నపనేని గుడిసెవాసులపైకి పోలీసులను ఉసికొల్పినట్టు ఆరోపణలున్నాయి. స్థానికులమనే పేరిట భూకబ్జాదారులను గుడిసెవాసులపైకి దాడికి పంపడంతో ఘర్షణ జరిగిన విషయం విదితమే. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని జక్కలొద్దిలో ‘నన్నపనేని’ రాజకీయాలు చేయడం వెనుక భూదందానే కారణమని తెలుస్తోంది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ‘తూర్పు’ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపనేని నరేందర్‌ పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవహారశైలి రోజురోజుకూ విమర్శలపాలవుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని జక్కలొద్దిలో ‘నన్నపనేని’ రంగప్రవేశం చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే తన బినామీలతో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే జక్కలొద్దిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించే ప్రయత్నంలో తాజా దాడులు చేయించినట్టు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌కు మంచి అస్త్రం
‘నన్నపనేని’ రాజకీయ మంత్రాంగం కాంగ్రెస్‌కు మంచి అస్త్రాన్ని అందించినట్లైంది. 17 నెలలుగా జక్కలొద్దికి రాని ‘నన్నపనేని’ ఇప్పుడే ఎందుకు వచ్చారు? అని గుడిసెవాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ హామిలు ఇవ్వని ‘తూర్పు’ ఎమ్మెల్యే ఇప్పుడు పట్టాలిప్పిస్తానని హామీలివ్వడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌ మెడకు ‘నన్నపనేని’ కుతంత్రం
నన్నపనేని నరేందర్‌ జక్కలొద్దిలో చేసిన కుతంత్రం బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది. తన నియోజకవర్గం కాకపోయినా జక్కలొద్దిలో జోక్యం చేసుకొని ఘర్షణకు కారణమైన ‘నన్నపనేని’ వ్యవహారశైలి ఆ పార్టీకి ఎన్నికల ముందు గుదిబండగా మారింది. ఎమ్మెల్యే తన గూండాలతో దాడులు చేయించడాన్ని పేదలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాడులు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీపీఐ (ఎం) నేతలపై దాడి
జక్కలొద్ది భూ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సాగర్‌, నాయకులు ఓదేలుపై ఎమ్మెల్యే అనుచరులు, గూండాలు దాడి చేసి జక్కలొద్దిలో భయానక వాతావరణం సృష్టించారు. భూముల్ని లాక్కునే ఎత్తుగడల్లో భాగంగానే కొద్దిరోజులుగా సీపీఐ(ఎం) నేతలపై ఎమ్మెల్యే దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే నరేందర్‌ వ్యవహరించిన తీరు ఆయనకు ప్రతికూలంగా మారే ప్రమాదముందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Spread the love