పార్కుల సుందరీకరణకు కృషి : ఎమ్మెల్యే కాలేరు

నవతెలంగాణ-అంబర్‌పేట
పార్కుల సుందరీకరణకు కృషి చేస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. శనివారం రూ.2 కోట్లతో చేపట్టిన వైభవ్‌ నగర్‌ కాలనీ అభివృద్ధి పనులను, రూ. 74లక్షలతో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. బాగ్‌ అంబర్‌ పేట డివిజన్‌ వైభవ్‌ నగర్‌ కాలనీలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బాగ్‌ అంబర్‌ పేట డివిజన్‌ కార్పొరేటర్‌ బి.పద్మ వెంకటరెడ్డితో కలిసి పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గాయత్రి టవర్‌ నుంచి వైభవ నగర వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలనీ, పార్కును అందంగా తీర్చిదిద్దాలనీ, వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వైభవ్‌నగర్‌ పార్కును రూ. 75 లక్షలతో సుందరంగా తయారు చేస్తున్నామని తెలిపారు. స్థానిక కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ పార్కును అతి సుందరంగా రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. పార్కులో ఫౌంటెన్‌, చుట్టూ చైన్‌ లింక్‌ మెష్‌, బల్లలు, పచ్చటి గడ్డి పరుపు, అందమైన మొక్కలు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గాయత్రి టవర్‌ నుంచి కాలనీ లోపలకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. సీజన్స్‌ హాస్పిటల్స్‌ వద్ద రూ.25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిందనీ, గీతా కాన్వెంట్‌ స్కూల్‌ దగ్గర రూ. 14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేసినట్టు తెలిపారు. గాయత్రి టవర్‌ దగ్గర రోడ్డు నిర్మాణం పూర్తయితే కొన్నేండ్లుగా ఉన్న వరద నీరు నిలిచే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని వెల్లడించారు. వైభవ్‌ నగర్‌లో ఎప్పటికీ ఏర్పడే వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీవాసులు ఒక ఆలోచనకు వస్తే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. కాలనీని సమగ్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, ఉద్యానవనశాఖ అధికారి హుస్సేన్‌, కాలనీ ప్రతినిధులు డాక్టర్‌ చారి, డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, సిద్ధార్థ, వేణుగో పాల్‌ అగర్వాల్‌, డాక్టర్‌ హరిచరణ్‌, కె.వి నారాయణ, డాక్టర్‌ భగవాన్‌ రెడ్డి, సురేష్‌, శ్యాంసుందర్‌ రెడ్డి, రామ్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love