రైల్వేల ప్రయివేటీకరణను ఆపాలి

– కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
– హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతీయ రైల్వేలను ప్రయివేటుపరం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించు కోవాలని హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు ఎం.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ 2004ను రద్దు చేయాలని, పాత పెన్షన్స్‌ స్కీమ్‌ను అమలు చేయాలని, రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం చట్ట ప్రకారం రూ.18,486 ఇవ్వాలని కోరారు. సీఐటీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. స్టేషన్‌ డిప్యూటీ మేనేజర్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం.వెంకటేష్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్దది.. ప్రజల ఆస్తి అయిన భారతీయ రైల్వేను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నాలను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. రైల్వేలు ప్రయివేటుపరం అయితే, ఉద్యోగులకే కాకుండా సామాన్య ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే చార్జీలు పెరుగుతాయని, ప్యాసింజర్‌ రైళ్లను తగ్గించి వందేభారత్‌ లాంటి ట్రైన్లు పెంచి సామాన్య ప్రజలు రైళ్లల్లో ప్రయాణం చేయలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గూడ్స్‌ రైళ్లను ప్రయివేటు పరం చేయడం వల్ల సిమెంటు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు, పప్పులు, బియ్యం, పండ్లు తదితర నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చట్ట ప్రకారం ప్రతినెలా 7వ తేదీన వేతనాలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, సంవత్సరానికి ఈఎల్‌ లీవులు 18, సీఎల్‌ లీవులు 12, పండుగ జాతీయ సెలవులు 12 ఇవ్వాలని, ప్రతి కార్మికునికీ పేస్లిప్‌ ఇవ్వాలని కోరారు. చట్టపర సౌకర్యాలు అమలు చేయని కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని, వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని అన్నారు. రైల్వేల రక్షణ కోసం రైల్వే ఉద్యో గులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, ప్రజలు ఒక్కతాటిపైకి రావాలని కోరారు. ఈ ధర్నాలో సీఐటీయూ నగర సహాయ కార్యదర్శులు ఎం.సత్యనారాయణరాజు, మధు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love