ఫోర్డ్‌లో వేలాది ఉద్యోగులపై వేటు..!

వాషింగ్టన్‌ : బహుళజాతి కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ తమ వేలాది మంది ఉద్యోగులను తొలగించను న్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో యూరప్‌లో 3,800 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్‌లో విద్యుత్‌ కార్ల డిమాండ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నామని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే జర్మనీలో 2,300 మందిని, బ్రిటన్‌లో 200 మందిని ఇంటికి పంపించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం యూరప్‌లో మొత్తం 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికల్లా యూరప్‌ అంతటా విద్యుత్‌ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్‌ కారును విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆర్థికంగా సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను గాడిలో పెట్టే ఉద్దేశంతోనే ఉద్యోగుల కోత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం సాధ్యమైనంత వరకు స్వచ్ఛంద విరమణ కార్యక్రమాన్ని తీసుకోనున్నామని తెలిపింది. విద్యుత్తు వాహన తయారీ దిశగా అడుగులు వేస్తున్నందున ఇంజినీర్ల సంఖ్య పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని అభిప్రాయపడింది.
లింక్డిన్‌లోనూ ఉద్యోగుల తొలగింపులు..!
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లింక్డిన్‌లోనూ ఉద్యోగుల కోత మొదలయ్యిందని తెలుస్తోంది. నియామక శాఖలోని ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కాగా.. ఎంత మందిని తొలగించేది ఆ సంస్థ వెల్లడించలేదు. 2023 ప్రారంభంలో టెక్‌ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఈ సంస్థ ఇప్పుడు తిరిగి ఉద్వాసనలకు పాల్పడటం ఆందోళనకరం. దీనికి సంబంధించి లింక్డిన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Spread the love