– ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం
– విదేశాంగ విధానంలో మోడీ సర్కారు విఫలం
– గ్రామీణ భారతంలో తీవ్ర అసమానతలు
– నాడు ఎర్రజెండాలు భూములు పంచితే.. నేటి పాలకులు వాటిని గుంజుకుంటున్నారు
– భూ సంస్కరణలు జరగాల్సిందే : రైతు సంఘం రాష్ట్ర మహాసభలో ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపు
కొత్తగూడెం నుంచి అచ్చిన ప్రశాంత్
నాడు రైతాంగ సాయుధ కొత్తగూడెం పోరాటం ద్వారా తెలంగాణలో, ప్రభుత్వాల ద్వారా కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు పేదలకు లక్షలాది ఎకరాల భూములను పంచితే… నేటి పాలకులు వాటిని గుంజుకుంటున్నారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగా చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. దాని స్థానంలో తెచ్చిన వీబీ జీ ఆర్ఏఎమ్జీ చట్టం బోగస్ అని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని హెచ్చరించారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య సంఘటనా పోరాటాలు అత్యావశ్యకమని నొక్కి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సామినేని రామారావు నగర్లో గురువారం ప్రారంభమైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధావలే మాట్లాడుతూ.. కొత్తగూడెంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సామినేని రామారావు, కాసాని ఐలయ్యకు ఘన నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సింగరేణి సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1.17 లక్షల నుంచి 40 వేలకు పడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రయివేటీకరణ వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థమైందన్నారు. బొగ్గు గనులను వేలం వేసి అందులో సింగరేణి సంస్థను కూడా పాల్గొనాలంటూ పాలకులు చెప్పడం దుర్మార్గమన్నారు. ఆ సంస్థకు వెంటనే బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. రూ.50 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణికి చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏ రాష్ట్రంలోనైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా పేదలకు భూములను పంచారా? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లోనూ పేదల భూములను గుంజుకుంటున్న తీరును ఎండగట్టారు. దీనివల్ల రైతులు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా మారిపోతున్న వైనాన్ని వివరించారు. నూతన ఆర్థిక విధానాల వల్ల ఐదు లక్షల మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం ధనిక రైతుల చేతుల్లో 80 శాతం భూములుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామీణ భారతంలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. దీన్ని సీరియస్గా తీసుకుని పనిచేయాలని రైతు సంఘం శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్రం ప్రకటించిన పంటలకు మద్దతు ధర అనేది బూటకంగా మారిందని ధావలే విమర్శించారు. తెలంగాణలో మొక్కజొన్నను మద్దతు ధర కంటే రూ.750 తక్కువకు కొంటున్న పరిస్థితిని ఎత్తిచూపారు. వరికి ఎమ్ఎస్పీ రూ.2,370 ఉండగా.. తెలంగాణలో పచ్చి వడ్లకు క్వింటాకు రూ.1,300 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. బీహార్, యూపీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం వెయ్యి కూడా దక్కట్లేదని చెప్పారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం క్వింటాకు రూ.3 వేలు ఇస్తున్నదనీ, రబ్బరు రైతులకు ప్రత్యేక బోనస్ ఇస్తున్నదని వివరించారు. అక్కడ రుణవిముక్తి చట్టం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
వ్యవసాయాన్ని అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే మోడీ సర్కారు మూడు నల్ల చట్టాలను తెచ్చిందని ధావలే గుర్తు చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటం ద్వారా వాటిని తిప్పికొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల మోడీ సర్కారు దొడ్డిదారిన ఆ చట్టాల అమలుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు ‘విద్యుత్ సవరణ చట్టం’ తీసుకొచ్చిందని వివరించారు. ఇండియా- యూఎస్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతులకే కాదు.. దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. విత్తనరంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్రం సీడ్బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అంశాలపైనే కాకుండా సామాజిక అణచివేతపైనా ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరముం దన్నారు. ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, ఇతర సామాజిక తరగతుల్లోని పేదలను కలుపుకుని సంఘటితంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య, ఏకే.గోపాలన్, నంబూద్రిపాద్, పిళ్లై, తదితర మహనీయుల స్ఫూర్తితో ఉద్యమాలను రూపొందించాలని సూచించారు. రైతాంగ పోరాటాల్లో మహిళా రైతుల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. వారు నాయకత్వ స్థాయిలోకి మరింతగా రావాలని కోరారు. హిందూత్వ ఏకత పేరుతో జరుగుతున్న ర్యాలీల పట్ల ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ట్రంప్ ముందు మోకరిల్లారనీ, విదేశాంగ విధానంలో బీజేపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. మోడీ, షా, మోహన్భగవత్లు నయా ఫాసిస్టులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ వేగంగా పెరుగుతున్న క్రమంలో వామపక్ష పార్టీలు తమ సొంత బలాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ..11 ఏండ్ల పాలనలో ప్రధాని మోడీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. పైగా, ప్రజల నుంచి బలవంతంగా భూములను గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు. మూడు నల్లచట్టాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నేతృత్వంలో బలమైన పోరాటాలు రావాలని ఆకాం క్షించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు లకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైం దని విమర్శించారు. మోడీ ఆర్థిక సంస్కరణల ఫలితంగా రైతాంగం సంక్షోభంలోకి కూరుకుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నవంబర్ నెలలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలుంటాయని ప్రకటించారు. రానున్న కాలంలో రైతాంగ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, సీఐ టీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీనియర్ నేతలు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ నేత జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం మహిళా విభాగం కన్వీనర్ కందాల ప్రమీల, ఆ సంఘం భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు,ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు, న్యాయవాది శివ రాంప్రసాద్, ఆదివాసీ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, ప్రజాసంఘాల నేతలు శ్రీరాం నాయక్, ఆశయ్య, ఉడుత రవీందర్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, మచ్చా వెంకటేశ్వర్లు, ఎమ్.జ్యోతి, బొంతు రాంబాబు, కె.పుల్లయ్య, కె.ధర్మా, వెంకట్, కె.బ్రహ్మచారి, బుర్రి శ్రీరామలు, అన్నవరపు సత్యనారాయణ, పిట్టల రవి, కార్పొరేటర్ సీహెచ్.శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.
వీబీ జీ ఆర్ఏఎమ్జీ చట్టం బోగస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



