ఎన్నికల ముందే సీబీఐ, ఈడీలొస్తారు..

– మోడీ ప్రభుత్వం ఇక ఇంటికే
– ఆదానీ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయండి
– భావసారూప్యపార్టీలను ఏకం చేస్తాం
– చెన్నై చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికలకు ముందే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులపై సీబీఐ, ఈడీ దాడులు చేయించి భయపెట్టడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తనతో పాటు బీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, ఐదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఇండ్లకు సీబీఐ, ఈడీ వచ్చాయన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సైతం ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. హామీలను అమలుచేయడంలో విఫలమై, మన దేశం పేరుని అంతర్జాతీయ స్థాయిలో మసకబారేందుకు కారణమైన బీజేపీకి 2024 లో గెలిచే అవకాశాలు ఎంత మాత్రమూ లేవని నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని తెలిపారు. శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పారదర్శకత, నిబద్ధతతో కూడిన పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ వాటిని ఎక్కడా పాటించలేదని విమర్శించారు. 2014లో 11.47 కోట్ల మందికి పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించి ఈ ఏడాది కేవలం 3.80 కోట్ల మంది రైతులకే ఇచ్చారని వివరించారు. ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పథకం అమలు చేయబోతున్నామంటూ పార్లమెంట్‌ సాక్షిగా మోడీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోనే 50 వేల మందికిపైగా రైతులను కేంద్ర కిసాన్‌ పథకం నుంచి తొలగించిన తీరును వివరించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోడీ…అదే రాజ్యసభలో 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారని విమర్శించారు. పార్లమెంటులో గంటన్నర సేపు ప్రసంగించిన ప్రధాని మోడీ.. అదానీ కుంభకోణం పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకపోతే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడ్డ కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని మోడీ సర్కారును నిలదీశారు.
సినీనటుడు అర్జున్‌ కట్టించిన ఆలయ సందర్శన
చెన్నై పర్యటన సందర్భంగా సినీహీరో అర్జున్‌ నిర్మించిన హనుమాన్‌ దేవాలయాన్ని కవిత సందర్శించారు. అర్జున్‌ దంపతులు ఆమెకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికీ ఆ గౌరవభావం ఉండాలని ఆమె అన్నారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్‌ ఆలయాన్ని కట్టిన అర్జున్‌ను ఈ సందర్భంగా కవిత అభినందించారు.

Spread the love