ఐదేండ్లు నిండితే ఒకటో తరగతిలో చేర్చుకోవాలి

– ఆరేండ్లు పూర్తి కావాలన్న నిబంధన అవసరం లేదు
– మంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఐదేండ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్చుకోవాలనే నిబంధనను కొనసాగించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేండ్లు నిండాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసిందని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం 50 ఏండ్లకుపైగా ఐదేండ్లు నిండిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకుంటున్నామని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల్లో కూడా అది ఉందని పేర్కొన్నారు. ఈ విధానం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నదని తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాల్లో ఎలాంటి హెచ్చుతగ్గుల్లేవని పేర్కొన్నారు. 15 ఏండ్లు పూర్తయ్యే నాటికి విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులవుతారని వివరించారు. అందువల్ల రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేండ్లు నిండాలనే నిబంధన అవసరం లేదని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య కూడా రెండేండ్లు సరిపోతుందని సూచించారు. మూడేండ్లు నిండిన తర్వాత నాలుగో ఏడాది, ఐదో ఏడాది పూర్వ ప్రాథమిక విద్య పూర్తవుతుందని వివరించారు. ఈ రెండేండ్లలో విద్యార్థికి అవసరమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. కానీ నూతన విద్యావిధానంలో మూడేండ్లు ప్రాథమిక విద్య అంటూ ప్రకటించిందని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో మూడేండ్ల పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తున్న వారికి ఇది చట్టబద్ధత కల్పించే దానిలో భాగమేనని విమర్శించారు. హైదరాబాద్‌్‌లో పూర్వ ప్రాథమిక విద్యకే ఏడాది ఫీజు రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు లేకపోవడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక తరగతుల నిర్వహణకు అవసరమైన వసతుల్లేకపోవడం వల్ల 80 శాతానికిపైగా మూడేండ్లు నిండిన బాల, బాలికలను వారి తల్లిదండ్రులు ప్రయివేటు విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారని వివరించారు. ఫీజుల భారం భరించలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

Spread the love