నేడు తారకరత్న అంత్యక్రియలు

‘యువగళం’ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురై గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ఆయన భౌతికకాయాన్ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ నుంచి హైదరాబాద్‌లోని మోకిలలోని తారకరత్న నివాసానికి తరలించారు. ఆదివారం తారకరత్న నివాసానికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతోపాటు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘన నివాళి అర్పించారు. నారాచంద్రబాబునాయుడు, బావ లోకేష్‌తోపాటు బాబారు బాలకృష్ణ, సోదరులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌తోపాటు చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, మురళీమోహన్‌, ఆలీ వంటి తదితర పరిశ్రమ ప్రముఖులు తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి, కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా బాబారు బాలయ్య తీవ్ర భావోద్వేగానికి లోనవ్వడం అందరి కళ్ళని చెమర్చింది. బాబారు బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమకు సంకేతంగా బాబారు బాలకృష్ణ సంతకాన్ని తారకరత్న తేన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇదిలా ఉంటే, తారకరత్న కూతురు నిష్క తన తమ్ముడిని పట్టుకుని నాన్నకోసం వెక్కి వెక్కి ఏడవటం అందరినీ కలచివేసింది.పెద్దలంటే గౌరవంతోపాటు ఇండ్రస్టీలో సౌమ్యుడిగా పేరొందిన తారకరత్న ఇకలేరనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం నేడు (సోమవారం) ఉదయం 8 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచి, తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Spread the love