కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్‌లో షూటింగ్‌ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన ఆయన అనారోగ్యం బారినపడ్డారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. డయాబెటిక్‌ పేషెంట్‌ కావడంతోపాటు సివియర్‌ మెటాబాలిక్‌ ఎసిడోసిస్‌ కారణంగా మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ జరగడంతో రాకేశ్‌ మాస్టర్‌ మృతి చెందినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెండ్‌ రాజారావు తెలిపారు. అలాగే ఆయన రెండు కండ్లను దానంగా చేసేందుకు రాకేశ్‌ మాస్టర్‌ కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు.
‘ఆట’, ‘ఢ’ లాంటి డ్యాన్స్‌ రియాల్టీ షోల ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా ఆయన పని చేశారు. ప్రస్తుతం ఇండిస్టీలో శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌తో సహా అగ్ర కొరియోగ్రాఫర్లు రాకేశ్‌ శిష్యులు కావడం విశేషం. అలాగే యూట్యూబ్‌ ఛానెళ్ళతోపాటు సోషల్‌ మీడియాలో ఈయన పలువురు హీరోలు, కొరియోగ్రాఫర్లపై చేసిన వ్యాఖ్యలు చాలాసార్లు వివాదస్పద మయ్యాయి. అద్భుత ప్రతిభగల రాకేశ్‌ మాస్టర్‌ మృతి పట్ల పలువురు కొరియోగ్రాఫర్లు, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నేడు(సోమవారం) హైదరాబాద్‌ బోరబొండలో రాకేశ్‌ మాస్టర్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Spread the love