సెమీస్‌లో తెలుగు టాలన్స్‌

– గోల్డెన్‌ ఈగల్స్‌పై మెరుపు విజయం
– ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌
జైపూర్‌ : ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌)లో సిక్సర్‌ బాదిన తెలుగు టాలన్స్‌ గ్రూప్‌ దశలో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తరప్రదేశ్‌పై తెలుగు టాలన్స్‌ 26-25తో ఉత్కంఠ విజయం సాధించింది. ప్రథమార్థంలో 14-14తో ఇరు జట్ల సమవుజ్జీలు నిలిచినా.. ద్వితీయార్థం ఉత్కంఠ రేపింది. 18-18, 20-20, 22-22తో ఆఖరు క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్‌ పైచేయి సాధించింది. ఒక్క గోల్‌ తేడాతో గోల్డెన్‌ ఈగల్స్‌ను ఓడించి పీహెచ్‌ఎల్‌లో సెమీస్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. టాలన్స్‌ తరఫున దేవిందర్‌ సింగ్‌ భుల్లార్‌ మెరువగా, గోల్డెన్‌ ఈగల్స్‌ను సుఖ్‌వీర్‌ సింగ్‌ రేసులో నిలిపాడు. సీజన్లో గోల్డెన్‌ ఈగల్స్‌కు ఇది ఐదో పరాజయం కాగా, తెలుగు టాలన్స్‌కు ఇది వరుసగా నాల్గో, ఓవరాల్‌గా ఆరో విజయం కావటం విశేషం.

Spread the love