పట్టాలు తప్పిన గోదావరి తప్పిన పెనుముప్పు

–  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అంకుషాపూర్‌వద్ద ఘటన
నవతెలంగాణ – ఘట్కేసర్‌
గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైలు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌కు చేరుకోగానే పట్టాలు తప్పింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం ఉదయం 6.09 గంటలకు ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అంకుషాపూర్‌ వద్దకు చేరుకోగా ప్రమాదవశాత్తు 6 బోగీలు అదుపు తప్పాయి. ఎస్‌1 నుంచి ఎస్‌4 తో పాటు 2 జనరల్‌ బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలు తప్పగానే పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అదుపు తప్పిన 6 బోగీలను ఉదయం 8 గంటలకు రైల్వే అధికారులు విడదీసి మిగతా బోగీల్లో ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించారు. అయితే రైలు చాలా సేపు పట్టాలపై నిలవడంతో కొంతమంది ప్రయాణికులు రోడ్డుమార్గాన తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సైతం ఇదే ట్రాక్‌పై ప్రయాణం చేస్తున్నది. దాని వేగానికి ఈ ట్రాక్‌ సామర్థ్యం మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంతో తెగిన రైలు పట్టాలు
రైలు పట్టాలు తప్పడంతో 219/31 మైలురాయి వద్ద పట్టాలు తెగిపోయాయి. మొత్తం 400 మీటర్ల మేరకు రైలుపట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అధికారులు యంత్రాలను తీసుకొచ్చి పట్టాలకు హుటాహుటిన మరమత్తులు చేపట్టారు. విద్యుత్‌, ఇంజనీరింగు, మెకానికల్‌, సిగలింగ్‌ కమర్షియల్‌, ఆర్పీఎస్‌ విభాగాల అధికారులు, సిబ్బంది తమ పనుల్లో నిమగమయ్యారు. పట్టాల మరమ్మతు సందర్భంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే వెల్లడిస్తామని జీఎం తెలిపారు. కీసర ఆర్డీవో, ఘట్‌కేసర్‌ తహసీల్దారు విజయలక్ష్మి తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని రైల్వే అధికారులు, సిబ్బందికి భోజన సౌకర్యం కల్పించారు. అలాగే మల్కాజిగిరి డీసీపీ జానకీ, ఘట్కేసర్‌ సీఐ అశోక్‌ రెడ్డి పనులను పర్యవేక్షించారు. దాదాపు 400 మంది రైల్వేశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని పట్టాలకు మరమత్తులు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు పనులు కొనసాగే అవకాశం ఉంది.

Spread the love