బార్సిలోనాలో ఢీకొన్న రెండు రైళ్లు: 155 మందికి గాయాలు


మాడ్రిడ్:
స్పెయిన్ దేశంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మాడ్రిడ్ శివార్లలో రెండు రైళ్లు ఢీకొనడంతో కనీసం 155 మంది గాయపడ్డారు. బార్సిలోనాలోని ఓ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఒక రైలు ఉండగా.. అదే దిశలో వచ్చిన మరో రైలు దాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 155 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అయితే, ఎక్కువ మందికి చిన్నపాటి గాయాలే అయ్యాయని తెలిపారు.
గాయపడిన ప్రయాణికుల్లో ఎవరికీ తీవ్ర గాయాలేమీ కాలేదని తెలిపారు. రైలు నెమ్మదించిన వేగంతోనే ఢీకొనడంతో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని చెప్పారు. రైలులోని వారు కిందపడటంతో స్వల్ప గాయాలకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఒకరిద్దరికి మాత్రమే తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. ఈ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైనట్లు రైలులోని ఓ ప్రయాణికురాలు తెలిపింది. అంతా అరుపులుకేకలు వేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది.

Spread the love