భవన నిర్మాణ కార్మికులకు రూ.6వేల పెన్షన్‌ ఇవ్వాలి

– సంక్షేమ పథకాలను మెరుగుపర్చాలి
– తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్‌టీయూ
– జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా .. అదనపు కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
భవన నిర్మాణ కార్మికులకు రూ.6వేల పెన్షన్‌ ఇవ్వాలని, సంక్షేమ పథకాలను మెరుగుపర్చాలని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం హెచ్‌74 (ఐఎఫ్‌టీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు నల్లన్న అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు హాన్మేశ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.ఎల్‌.పద్మ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి రాందాసు, నాయకులు రాజు, వెంకటేష్‌, నాగరాజు, బాలస్వామి, బొమ్మను పహడు మల్లేష్‌, కోశాధికారి అంజి, రమేష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేస్‌ ప్రదీప్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్‌, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు స్వరూప, ప్రజాపంథా నాయకులు రవి తమ సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆ సంఘం ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను మెరుగుదల చేయాలని, ప్రమాద మరణానికి రూ.6లక్షల నుంచి 10 లక్షలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సహజ మరణానికి రూ. లక్ష 30వేల నుంచి రూ.5లక్షలకు పెంచాలని, 60 ఏండ్లు పైబడిన వారికి రూ.6వేల పెన్షన్‌ ఇవ్వాలన్నారు. పెండ్లి కానుక, ప్రసూతి సహాయం రూ.30వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని కోరారు. ఇండ్లు లేనివారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ మంజూరు చేయాలని, సొంత స్థలం ఉన్నవారికి రూ.5లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు, స్కాలర్షిప్స్‌ మంజూరు చేయాలన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోకి కార్మిక సంఘాల ప్రాతినిధ్యం, కార్మిక శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. నగరంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు కనీస అవసరాలు తీర్చడంలేదని, అడ్డాలు లేవని, ఉన్నవాటికి షెల్టర్స్‌ లేవన్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. అధికారులు స్పందించి నగరంలో అడ్డాల దగ్గర సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కార్డులు తీసుకోలేని ఎనిమిది లక్షల మందికి యుద్ధ ప్రాతిపదికన లేబర్‌ కార్డు ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

Spread the love