వేధింపుల నుంచి డొమెస్టిక్‌ వర్కర్స్‌కు రక్షణ కల్పించాలి :ఎఐసీసీడీడబ్ల్యూ డిమాండ్‌

న్యూఢిల్లీ : గుర్‌గావ్‌లోని ఒక ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అమానవీయమైన రీతిలో వేధింపులకు, దూషణలకు పాల్పడుతున్న దంపతులపై కఠిన చర్య తీసుకోవాలని అఖిల భారత డొమెస్టిక్‌ వర్కర్స్‌ సమన్వయ కమిటీ (ఎఐసీసీడీడబ్ల్యూ) పోలీసులను కోరింది. ఈ వేధింపులపై దర్యాప్తు జరిపి, ఈ ఇంట్లో ఆమెను పనికి నియమించిన సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. బాధిత మైనర్‌ అని వార్తలు వస్తున్నాయని, అదే గనుక నిజమైతే పనిలో పెట్టుకున్న దంపతులు, పనిలో పెట్టిన సంస్థ ఇరు పక్షాలను బాల కార్మిక రక్షణ, నియంత్రణ చట్టం కింద విచారించాలని కోరింది. 14ఏళ్ళ లోపు వారు ఏ రంగంలో పని చేయకుండా నిషేధించాలని ఆ చట్టం కోరుతోంది. అలాగే బాధితురాలికి తగిన వైద్య చికిత్సనందించి, నష్టపరిహారం అందించాలని కమిటీ కోరింది. ఎన్‌సిఆర్‌ రీజియన్‌లో ఇలా పనిమనుష్యులను వేధిస్తున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చినప్పటికీ, అటు కార్మిక శాఖ గానీ ఇటు పోలీసులు గానీ వీటిపై స్పందించి చర్యలు తీసుకున్న దాఖలా కనిపించడం లేదని ఎఐసీసీడీడబ్ల్యూ పేర్కొంది. ప్రఖ్యాతి చెందిన సంస్థల్లో పనిచేస్తూ, మంచి ఆకర్షణీయమైన వేతనాలు సంపాదించుకుంటున్న వారు తమ ఇళ్లలో పనిచేసే వారిని కనీసం మనుష్యులుగా కూడా చూడకపోవడం విచారకరమని పేర్కొంది. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఈ విషయంలో మౌనం పాటించడం మరింత దిగ్భ్రాంతికరమని కమిటీ పేర్కొంది. డొమెస్టిక్‌ వర్కర్స్‌ పని పరిస్థితులను క్రమబద్ధీకరించి, వారికి ఇలాంటి వేధింపుల నుండి రక్షణ కల్పించాల్సిన తక్షణావశ్యకత వుందని పేర్కొంది. ఇటువంటి కేసులు ఎక్కడ జరిగినా అప్రమత్తంగా వుండి వెంటనే యూనియన్‌కు, స్థానిక పోలీసులకు తెలియచేయాలని కమిటీ కోరింది.

Spread the love