పీఈసెట్‌లో 1,707 మంది ఉత్తీర్ణత

– బీపీఈడీలో 1,660 సీట్లు, 1,153 మంది అర్హత
– డీపీఈడీలో 350 సీట్లు, 554 మంది ఉత్తీర్ణత
– ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రస్తుత విద్యాసంవత్సరం (2023-24)లో రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) ఫలితాలను శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఈసెట్‌కు 2,865 మంది దరఖాస్తు చేశారని, 1,769 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 1,707 (96.50 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఇందులో 1,664 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారని అన్నారు. వారిలో 997 (96.80 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని చెప్పారు. 1,201 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 739 మంది పరీక్ష రాశారని అన్నారు. వారిలో 710 (96.08 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. అయితే బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుకు చెందిన 16 కాలేజీల్లో 1,660 సీట్లున్నాయని చెప్పారు. బీపీఈడీలో 1,153 మంది అర్హత సాధించారని అన్నారు. అందరూ ప్రవేశాలు పొందినా 507 సీట్లు మిగులుతాయని అన్నారు. డిప్లొమా ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ) కోర్సుకు సంబంధించి నాలుగు కాలేజీల్లో 350 సీట్లున్నాయని వివరించారు. డీపీఈడీలో 554 మంది ఉత్తీర్ణత పొందారని చెప్పారు. బీపీఈడీలో జనగామకు చెందిన గుర్రం దేవ మొదటి ర్యాంకు, రంగారెడ్డికి చెందిన కేలావత్‌ భారతి రెండో ర్యాంకు, జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన బానాల జగదీశ్‌ మూడో ర్యాంకు, వరంగల్‌ రూరల్‌కు చెందిన బల్లె హరీశ్‌ నాలుగో ర్యాంకు, నల్లగొండకు చెందిన గొర్ల లోకేశ్వరి ఐదో ర్యాంకు సాధించారని వివరించారు. డీపీఈడీలో నల్లగొండకు చెందిన నారిమళ్ల ప్రవళిక ప్రథమ ర్యాంకు, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఊకే సంధ్య రెండో ర్యాంకు, జనగామకు చెందిన చెరిపెల్లి కీర్తన మూడో ర్యాంకు, మహబూబాబాద్‌కు చెందిన అర్వపల్లి సుస్మిత నాలుగో ర్యాంకు, జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన జటోత్‌ ఐశ్వర్య ఐదో ర్యాంకు పొందారని చెప్పారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ మాట్లాడుతూ పాఠశాలల్లో పీఈటీలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వారి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన వర్సిటీ వీసీ ఎస్‌ మల్లేష్‌, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రామకృష్ణ, పీఈసెట్‌ కన్వీనర్‌ రాజేష్‌కుమార్‌, మాజీ కన్వీనర్‌ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పీఈసెట్‌ ఉత్తీర్ణత వివరాలు కోర్సు అభ్యర్థుల హాజరు ఉత్తీర్ణత
అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం

బీపీఈడీ 664 529 1,193 642 511 1,153
డీపీఈడీ 366 210 576 355 199 554
మొత్తం 1,030 739 1,769 997 710 1,707

Spread the love