ఇంజినీరింగ్‌లో అందుబాటులో ఉన్న సీట్లు 19,049

– 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
– అభ్యర్థులు చేరేందుకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ఇంకా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్లు కేటాయించిన అభ్యర్థులు కాలేజీల్లో చేరే గడువు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో ఇంకా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో 3,034 సీట్లు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)లో 2,721 సీట్లు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ)లో 2,630 సీట్లు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 2,542 సీట్లు, సివిల్‌ ఇంజినీరింగ్‌లో 2,505 సీట్లు, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌) (సీఎస్‌ఎం)లో 1,785 సీట్లు, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (డేటాసైన్స్‌)లో 1,012 సీట్లతోపాటు ఇతర కోర్సుల్లోనూ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే రాష్ట్రంలోని 174 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 83,766 సీట్లున్నాయి. తుదివిడత కౌన్సెలింగ్‌ నాటికి 70,627 (84.31 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. వారిలో 64,717 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో ఇంకా 19,049 సీట్లు మిగిలాయి. ఈనెల 17 నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాని ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అభ్యర్థులు చేరేందుకు అవకాశమున్నది.

Spread the love