రెండ్రోజుల్లో 246 చర్చిలు దగ్ధం

– ముందస్తు ప్రణాళికతో దాడులు
– హింస వెనక ఎవరో బలమైనవారున్నారు
– మణిపూర్‌లో పరిస్థితులపై ఫాదర్‌ జాకబ్‌ జి పాలకప్పిల్లి
ఇంఫాల్‌ : మణిపూర్‌లో పరిస్థితులపై కేరళ కాథలిక్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ ఫాదర్‌ జాకబ్‌ జి పాలకప్పిల్లి ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేశారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడం, చర్చిలపై ముందస్తు ప్రణాళికతో దాడులు, అధికారులు, ప్రధాని మౌనం గురించి ఆయన మాట్లాడారు. రెండు రోజుల వ్యవధిలో మణిపూర్‌లో పెద్ద సంఖ్యలో మతపరమైన దాడులు జరిగాయన్నారు. దీంతో మెయిటీ క్రిస్టియన్లకు చెందిన 249 చర్చిలు ధ్వంసమయ్యాయని జాకబ్‌ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మణిపూర్‌లో క్రైస్తవ సంస్థలపై దాడుల విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసను 2002 గుజరాత్‌ అల్లర్లతో పోల్చారు. క్రైస్తవులు హింసకు గురయ్యారని చెప్పారు. మణిపూర్‌లో జరిగిన సంఘర్షణ రెండు తెగల మధ్య ఒకటిగా చిత్రీకరించబడుతున్నప్పటికీ.. కుకీ, మెయిటీ కమ్యూనిటీలకు చెందిన క్రైస్తవులు హింసకు గురి అవుతున్నారని తెలిపారు. చర్చిలు, క్రైస్తవ సంస్థలు, క్రైస్తవులు మొత్తం హింసాత్మక చర్యల ద్వారా దాడి చేయబడ్డారన్నారు. మణిపూర్‌లోని క్రైస్తవ మత పెద్దల నుంచి తమకు అందిన సందేశం కూడా ఇదేనని జాకబ్‌ తెలిపారు. బీజేపీ క్రిస్టియన్‌ ఎమ్మెల్యేలు, అనుచరులు కూడా అక్కడ అనిశ్చితితో, ఆందోళన చెందుతున్నారని కేరళ ఎంపీ హిబీ ఈడెన్‌ గతంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. ప్రతికూల ప్రచారంతో క్రైస్తవ సమాజాన్ని తుడిచిపెట్టే చర్యలు జరుగుతున్నాయన్నారు. 2007లో ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో క్రైస్తవులు ఎదుర్కొన్న లక్ష్య హింసతో జాకబ్‌ పోల్చారు. మణిపూర్‌ హింస వెనక ఎవరో బలమైన ఆట ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇది చర్చిలు, క్రైస్తవ సంస్థలు, క్రైస్తవులపై ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని జాకబ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love