వచ్చే మూడేళ్లలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు

30 thousand crore investments in the next three years– 15,600 కిలోమీటర్ల పైపులైన్ల ఏర్పాటు
– జాతీయ గ్రిడ్‌ నిర్మాణం : గెయిల్‌ ఛైర్మన్‌ వెల్లడి
న్యూఢిల్లీ : దేశీయ గ్యాస్‌ సరఫరా దిగ్గజం గెయిల్‌ (ఇండియా) వచ్చే మూడేళ్లలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. పెట్రోకెమికల్‌ సామర్థ్యం విస్తరణ, గ్లోబల్‌ ఎల్‌ఎన్‌జి సరఫరాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ సందీప్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. బుధవారం జరిగిన కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో గుప్తా మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు.
”గెయిల్‌ క్రమంగా అభివృద్థి చెందుతోంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. ప్రధానంగా పైప్‌లైన్‌లు, కొనసాగుతున్న పెట్రోకెమికల్‌ ప్రాజెక్టులు, సిజిడి ప్రాజెక్టులు, ఆపరేషనల్‌ క్యాపెక్స్‌, గ్రూప్‌ కంపెనీల్లో ఈక్విటీ సహకారం తదితరాలపై వచ్చే మూడేళ్లలో రూ.30,000 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. 15,600 కిలోమీటర్ల పైప్‌లైన్‌లు ఆపరేషన్‌లో ఉన్నాయి. దాదాపు 4,200 కిలోమీటర్ల పైప్‌లైన్‌లు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో దాదాపు 20,000 కిలోమీటర్ల జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ను పూర్తి చేయనున్నాము. 160 కి.మీ గురుదాస్‌పూర్‌-జమ్మూ మార్గంలో సహజ వాయువు పైప్‌లైన్‌ వేయడానికి, నిర్మించడానికి, నిర్వహించడానికి లైసెన్స్‌ను దక్కించుకున్నాము. జగదీష్‌పూర్‌-హల్దియా- బొకారోలో అంతర్భాగంగా బరౌని-గౌహతి పైప్‌లైన్‌ (బిజిపిఎల్‌) విభాగం ద్వారా 729 కిలోమీటర్ల మేర ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు సహజ వాయువును సరఫరా చేయనున్నాము.” అని గుప్తా తెలిపారు. భారత్‌లో పెరుగుతున్న పెట్రోకెమికల్‌ డిమాండ్‌తో, వచ్చే దశాబ్దంలో పెట్రోకెమికల్స్‌లో పెరుగుతున్న ప్రపంచ వృద్థిలో భారత్‌ 10 శాతానికి పైగా దోహదం చేస్తుందని గుప్తా పేర్కొన్నారు.

Spread the love