– స్థానికత ఆధారంగా సొంత జిల్లాకు తేవాలి
– 317, 46 జీవోలను రద్దు చేయాలి : మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతి
– అధ్యయనం చేసి సీఎంకు నివేదిక సమర్పిస్తాం : దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సత్వరమే న్యాయం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మంత్రివర్గ ఉపసంఘాన్ని డిమాండ్ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగులను సొంత జిల్లా, జోన్‌కు బదిలీ చేయాలని కోరాయి. ఉద్యోగులకు నష్టం చేసిన 317, 46 జీవోలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాయి. గురువారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో 317 జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఉపసంఘం చైర్మెన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు మంత్రులు డి శ్రీధర్‌బాబు, అధికారులు పీఆర్సీ చైర్మెన్ శివశంకర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, సచివాలయ సర్వీసెస్ కార్యదర్శి నిర్మల, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. 317, 46 జీవోలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సంఘాల విజ్ఞాపనలు, సలహాలు, సూచనలను స్వీకరించామని చెప్పారు. వాటిని పరిశీలించి అధ్యయనం చేసి తగు నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పిస్తామని వివరించారు. సానుకూలంగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు డి శ్రీధర్‌బాబుకు కె జంగయ్య, చావ రవి, లక్ష్మారెడ్డి, ఈ గాలయ్య, పి మాణిక్‌రెడ్డి, గోపాల్‌నాయక్, సృజన, లివిన్‌స్టన్ (టీఎస్‌యూటీఎఫ్), మారం జగదీశ్వర్, కస్తూరి వెంకటేశ్వర్లు (టీఎన్జీవో), ఏలూరి శ్రీనివాసరావు, ఉపేందర్‌రెడ్డి, మాచర్ల రామకృష్ణగౌడ్ (టీజీవో), పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూటీఎస్), జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి (ఎస్టీయూటీఎస్), హన్మంతరావు, నవాత్ సురేష్ (తపస్), పి రాజభాను చంద్రప్రకాశ్, ఆర్ రాజగంగారెడ్డి, బి తుకారాం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ), పి మధుసూదన్‌రెడ్డి (జీజేఎల్‌ఏ), కె కృష్ణుడు (బీసీటీఏ), ఎండీ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి (టీఎస్టీయూ), ఎం వీరాచారి, లక్ష్మికాంతరెడ్డి, సానా సురేందర్, రవీందర్ (ఎల్‌సీజీటీఏ), టి లింగారెడ్డి (డీటీఎఫ్), రాధాకృష్ణ (టీపీటీయూ)తోపాటు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, డ్రైవర్ల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని వినతిపత్రాలను సమర్పించారు.
బాధితులందరికీ న్యాయం చేయాలి : టీఎస్‌యూటీఎఫ్
317, 46 జీవో బాధితులందరికీ సత్వరమే న్యాయం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. 317 జీవోను సాఫీగా అమలు చేసి బదిలీలు, పదోన్నతుల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని సూచించింది. సానుకూలంగా సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తెలిపింది. స్థానికేతర మల్టీజోన్/జోన్/జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను వారి మొదటి ఆప్షన్ ప్రకారం స్థానిక మల్టీజోన్/జోన్/జిల్లాలకు బదిలీ చేయాలని పేర్కొంది. ఖాళీలు అందుబాటులో లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడే వాటిలో దశలవారీగా సర్దుబాటు చేయాలని సూచించింది. నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించిన టీఆర్టీ-2017లో ఎంపికై స్థానికేతర జిల్లాలో నియామకమైన ఉపాధ్యాయులను వారి ఆప్షన్ మేరకు స్థానిక జిల్లాకు బదిలీ చేయాలని కోరింది. ఉమ్మడి పది జిల్లాలను పది జోన్లుగా విభజించాలని పీఆర్టీయూటీఎస్ సూచించింది. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలనీ, ఆ జిల్లాలో ఖాళీల్లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని కోరింది. ఉమ్మడి జిల్లా పరిధిలో వారు కోరుకున్న జిల్లా కాకుండా ఇతర జిల్లాకు కేటాయించబడిన ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా స్థానిక జిల్లాకు బదిలీ చేయాలని సూచించింది. అశాస్త్రీయంగా విభజించబడ్డ మల్టీ జోన్, జోన్లు, జిల్లాలు, మండలాల వ్యవస్థ వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని టీఎస్‌జీహెచ్‌ఎంసీ విమర్శించింది. ఉమ్మడి పది జిల్లాలను పది జోన్లుగా ఏర్పాటు చేయాలని సూచించింది. ఆర్టికల్ 371-డికి విరుద్ధంగా ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని రద్దు చేస్తేనే 317 జీవో రద్దవుతుందనీ, తద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఎల్‌సీజీటీఏ తెలిపింది.