ఘనంగా వీఐటీ 38వ వార్షిక స్నాతకోత్సవం

చెన్నయ్ / విజయవాడ : వెల్లూర్‌ ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ టెక్నలాజీ (వీఐటీ) ఇటీవల తన 38వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్టు తెలిపింది. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగం చేశారని పేర్కొంది. విఐటి వ్యవస్థాపక ఛాన్సలర్‌ డాక్టర్‌ జి. విశ్వనాథన్‌ కాన్వకేషన్‌కు అధ్యక్షత వహించారని తెలిపింది. ఈ సందర్బంగా వికె సింగ్‌ మాట్లాడుతూ.. ”విజయానికి షార్ట్‌కట్‌ లేదు. మీరు ఎంతో నిబద్ధతతో, పరిజ్ఞానంతో కష్టపడి పని చేయడం ద్వారానే మీ విజయం ఆధారపడి ఉంటుంది.” అన్నారు. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారానికి కట్టుబడి ఉండకుండా ఆచరణాత్మక మార్గంలో పరిష్కారాలను వెతకాలని పట్టభద్రులకు ఆయన సూచించారు. అభివద్ధి, మౌలిక సదుపాయాలపై కేంద్రం దృష్టి సారించడంతో విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు.
వీఐటీ-ఏపీపైనే కంపెనీల చూపు : విశ్వనాథన్‌
దేశంలోని అన్ని కంపెనీలు కూడా అద్బుతమైన ప్రతిభావంతులైన విద్యార్థులను కలిగి ఉన్న వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం వైపే చూస్తున్నాయని వీఐటీ వ్యవస్థాపకులు, ఛాన్స్‌లర్‌ జి విశ్వనాథన్‌ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ప్లేస్‌మెంట్స్‌, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన విజయాలపై ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. తమ కెరియర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (సీడీసీ) దేశ, విదేశాల్లోని అగ్రశ్రేణి కంపెనీలలో ఉద్యోగం సంపాదించడానికి విద్యార్థులకు సాయం చేస్తుందన్నారు.
2022-23లో వీఐటీ ప్రాంగణ నియామకాల్లో 900 కంపెనీలు దాదాపు 14,500 మందికి జాబ్‌ ఆఫర్లను అందించాయని ఆ సంస్థ పేర్కొంది.

Spread the love