– 16 కేంద్రాల్లో నిర్వహణ
– కొత్తగా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల నాలుగో తేదీ నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, మంచిర్యాల, నిర్మల్‌లో ఒకటి చొప్పున హైదరాబాద్‌లో రెండు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మూల్యాంకనం కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. గతనెల 28 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈనెల నాలుగు నుంచి సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అది ఈనెల ఐదో తేదీ వరకు కొనసాగుతుంది. ఈనెల 16 నుంచి మొదటి విడతలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈనెల 17 వరకు కొనసాగుతుంది. ఈనెల 20 నుంచి రెండోవిడతలో ఫిజిక్స్, ఎకనామిక్స్ జవాబుపత్రాల మూల్యాంకనం చేపడతారు. ఆ ప్రక్రియ ఈనెల 21 వరకు జరుగుతంది. ఈనెల 22 నుంచి మూడో విడతలో కెమిస్ట్రీ, కామర్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియ ఈనెల 23 వరకు జరుగుతుంది. ఈనెల 24 నుంచి నాలుగో విడతలో హిస్టరీ, బాటనీ, జువాలజీ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను చేపడతారు. అది ఈనెల 25 వరకు కొనసాగుతుంది.
టీజీజేఎల్‌ఏ హర్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ-475) హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్నేండ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న అధ్యాపకులు ఇంటర్ మూల్యాంకనం కోసం ఖమ్మం వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అక్కడ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనికి శృతి ఓజా స్పందించి కొత్తగూడెం పట్టణంలో సింగరేణి మహిళా జూనియర్ కాలేజీలో మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.