6 గ్యారంటీల అమలులో అధికారులు భాగస్వాములు కావాలి

– జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా
నల్గొండ ప్రజల ఆకాంక్షలను మనమందరం కలిసి నెరవేర్చాలి
– రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
– కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, విద్యుత్, రహదారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై  మంత్రి సమీక్ష
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
అధికారులు ప్రజా ప్రతినిధులకు సహకరించి జిల్లా అభివృద్ధి కి కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోమవారం  జిల్లాకు విచ్చేసిన మంత్రికి ప్రజలు, అభిమానులు అడు గడుగునా అపూర్వ స్వాగతం పలికారు.చౌటుప్పల్ మండలం ఆందోల్ కట్ట మైసమ్మ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి నల్గొండ జిల్లా పర్యటనకు బయలు దేరారు.చౌటుప్పల్ చౌరస్తా, పంతoగి టోల్ ప్లాజా, చిట్యాల సెంటర్, నార్కట్ పల్లి గుండా నల్గొండ పట్టణంకు చేరుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. నల్గొండ పట్టణంలో మర్రిగూడ బైపాస్ సెంటర్ వద్ద నుండి ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. నివాసం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్ లు మొక్కలు అందచేసి స్వాగతం పలికారు. కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, విద్యుత్, రహదారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చట్ట సభల ద్వారా శాసనాలు చేస్తుందని, ప్రభుత్వ పాలసీలు అమలు చేయడం ఉద్యోగులు బాధ్యత అని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు అధికారులు ప్రజా ప్రతినిధులకు సహకారం అందిస్తూ జిల్లాను అభివృద్ది పథంలో తీసుకువెళ్లేందుకు అధికారులు నిస్పాక్షపాతంగా పనిచేయాలి అన్నారు.
    కాంగ్రెస్ ప్రభుత్వం మీద పేదలకు చాలా నమ్మకం, ఆశలు ఉన్నాయి. వారి ఆశల్ని మనమందరం కలిసి నిలబెట్టాలని, తమ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులను గౌరవిస్తుందని, నిబంధనల మేరకు నడచు కొవాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రతి రోజూ ముఖ్యమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు.
మిషన్ భగీరథపై సమీక్ష
50 వేల పైచిలుకు కోట్లు ఖర్చు చేసిన మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీళ్లు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని అన్నారు. ఏ గ్రామానికి పోయినా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు.. వచ్చిన అవి కల్తీగా ఉంటున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు అని మంత్రి కోమటి రెడ్డి,శాసన సభ్యులు వేముల వీరేశం, బత్తుల లక్ష్మా రెడ్డి, ఎం.శామ్యూల్, బాలూ నాయక్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రోజూ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో రోజు తప్పించి రోజు నీటి సరఫరా జరుగు తోందని, మిషన్ భగీరథలో  బోర్ వాటర్ కలుస్తోందని, కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో బోర్ వాటర్ రావడం లేదు, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరగడం లేదని తెలిపారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నట్టు మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు.
మంత్రి స్పందిస్తూ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్వయంగా పర్యటించి సమస్య పరిష్కరిస్తారని కలెక్టర్ అర్.వి.కర్ణన్ తెలిపారు.
నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ పైపు లైన్ లు వేసి నల్లాలు బిగించ లేదని, సి.సి.రోడ్డు వేసి ధ్వంసం చేశారని, రోడ్లను పునరుద్ధించాలని అన్నారు. ఔరవాని, చౌడం పల్లి, నార్కట్ పల్లి పట్టణం సూర్య నగర్ లో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదని తెలిపారు. సక్రమంగా మిషన్ భగీరథ నీరు గ్రామాల్లో సరఫరా కావడం లేదని తెలిపారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా ఎన్ని రోజులు జరుగుతుంది ఎన్ని నల్లా కనెక్షన్లు బిగించారు. ఎంత పరిమాణం లో నీటి సరఫరా తదితర అంశాలపై నివేదిక రూపొందించి, శాసన సభ్యులకు అంద చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
       దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గలలో కూడా మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలను దేవరకొండ శాసనసభ్యులు బాలూ నాయక్, తుంగతుర్తి శాసనసభ్యులు ఎం.శామ్యూల్ సమావేశంలో ప్రస్తావించారు. జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో గ్రామాల్లో నీటి సరఫరా అందడం లేదు, చిన్నచిన్న లోపాలు ఉన్నాయి. సరి చేయాలని కోరారు. మిషన్ భగీరథ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు తర్వాత ప్రతి నియోజకవర్గం లో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన పనులు శాసన సభ్యులకు  వివరించి సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వారం ప్రతి మండలంలో రెండు గ్రామాలు తీసుకుని ప్రజలకు మిషన్ భగీరథ శుద్ది చేసిన నీరు తాగేలా అవగాహన కలిగిస్తామని తెలిపారు.ప్రతి రోజూ మిషన్ భగీరథ రక్షిత నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు పనుల లోపాలు ఉన్న చోట పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టీ రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రికవరీ చేయాలని ఆదేశించారు.
విద్యుత్ పై సమీక్ష
జిల్లాలో విద్యుత్ సమస్యలు ఉండకూడదని, సబ్ స్టేషన్ల ఏర్పాటు, విస్తరణ కోసం టెండర్లు పిలిచి పనులు చేయకపోవడం పట్ల అధికారులని మంత్రి వివరణ  కోరారు. కరెంట్ షాక్ తో మరణించిన 32 మందికి కంపెన్షషన్ ఇప్పటికి ఇవ్వకపోవడం బాధాకరం.. వెంటనే చర్యలు చేపట్టి వారికి కంపెన్సేషన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తీర్చేందుకు కావాల్సిన నిధుల వివరాలు ఇస్తే సీఎంతో మాట్లాడి నిధులు మంజూరి చేయిస్తానని మంత్రి తెలిపారు.
     కరెంట్ సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు.. పవర్ కు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో లూప్ లైన్ లు తొలగించి ప్రమాధాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అందుకు  సంబందించి అంచనాలు రూపొందించి ప్రతి పాధనలు జిల్లా కలెక్టర్ ద్వారా సమర్పించాలని,నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
 వ్యవసాయ శాఖ సమీక్ష
వ్యవసాయ శాఖ ద్వారా  వానాకాలం 2023-24 సీజన్ లో ధాన్యం సేకరణ,రైతులకు మద్దతు ధర చెల్లింపుపై మంత్రి మాట్లాడుతూ రైతులకు ధాన్యం విక్రయించిన పెండింగ్ లో ఉన్న వారికి త్వరగా చెల్లింపు చేయాలని ఆదేశించారు.పౌర సరఫరాల శాఖ ద్వారా చౌక ధరల దుకాణాల ద్వారా ఒక రూపాయి బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ పేదల సమస్యలు తీర్చే డిపార్ట్మెంట్..ఎక్కడ డీలర్లు ఖాళీలు ఉండకూడదని తెలిపారు.
రహదార్లుపై
నల్గొండ, ముషంపల్లి, ధర్మారం రోడ్డుపై మంత్రిగా మొదటి సంతకం చేశాను. పనులు ఎక్కడ వరకు వచ్చాయని మంత్రి అధికారులను వివరణ కోరారు. ఆర్థిక శాఖలో ప్రాసెస్ లో వుందని మంజూరు కాగానే టెండర్ లు పిలిచి పనులు మొదలు పెడతామని అర్ అండ్ బి ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తెలిపారు. రాయగిరి, మోత్కూరు రోడ్డు పనులు, దర్వేశి పురం బ్రిడ్జి పనులు, మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఎంఎల్సీ నర్సి రెడ్డి మాట్లాడుతూ మాడుగులపల్లి నుండి మోత్కూరు రోడ్డు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని కోరారు. మనమందరం కలిసి సమస్యలు లేని నల్గొండని నిర్మిద్దాం అన్నారు. అధికారులు ఏదైనా సమస్య ఉంటే నన్ను నేరుగా కలిసి చెప్పాలని మంత్రి  అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్వి కర్ణన్ పదోన్నతిపై ఆరోగ్య శాఖ డైరెక్టర్ గా వెళ్తున్నందున  మంత్రి  కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు  సమర్థవంతంగా నిర్వహించారని, కలెక్టర్ గా అందించిన సేవలు జిల్లా ప్రజలు గుర్తుంచు కొంటారని అన్నారు.
ఈ సమావేశంలో ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి, జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎం.శామ్యూల్, కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, సి.ఈ చెన్నా రెడ్డి,
ఎస్. ఈ.వెంకటేశ్వర్లు, అర్ అండ్  బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్.పి.డి.సి.ఎల్.ఎస్. ఈ.చంద్ర మోహన్, డి.ఎస్. ఓ  వెంకటేశ్వర్లు,జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మంత్రికి పుష్ప గుచ్చాలు, శాలువాలతో  సత్కరించారు.
Spread the love