విదేశాల్లో డొల్ల కంపెనీలు

–  అదానీ గ్రూపుతో రహస్య లావాదేవీలు
–  అదానీ సోదరుడు వినోద్‌ కీలక పాత్ర
–  బ్రిటన్‌, మారిషస్‌, దుబారుల్లో ఏడు సంస్థలు
–  కంపెనీల ఫైలింగ్‌ల్లో వినోద్‌, అతని భార్యపేరు
–  యూఏఈ, సింగపూర్‌, సైప్రస్‌, కరేబియన్‌ దీవుల్లోనూ పలు కంపెనీలు
న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా రుణాలను తీసుకొని అప్పుల కుప్పపై విస్తరించిన అదానీ గ్రూపునకు సంబంధించి ‘హిండెన్‌బర్గ్‌’ నివేదికతో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. అదానీ గ్రూపు వ్యాపార వ్యవహారంలో అతని సోదరుడు వినోద్‌ అదానీకి సంబంధించిన పాత్ర కీలకంగా మారింది. దీనిపై ఒక ప్రముఖ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, మారిషస్‌, దుబారులలో నమోదైన ఏడు జాబితా చేయని సంస్థలు ఉన్నాయని గతేడాది ఆగస్టులో అదానీ గ్రూపుతో పాటు బ్యాంకులు బయటపెట్టిన కీలక పత్రాల్లో పేర్కొనబడ్డాయి. ఆ సంస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. అయితే, ఈ ఏడు సంస్థల అంతిమ లబ్దిదారుని పేరు గ్రూపు చైర్మెన్‌ గౌతమ్‌ అదానీగా జాబితా చేయబడి లేదు. ఫైలింగ్‌లలో మాత్రం లాభాదాయకమైన యజమానులు అతని అన్నయ్య వినోద్‌, వినోద్‌ భార్య రంజన్‌బెన్‌ అని పేర్కొనబడింది. వినోద్‌ కొన్నేండ్లుగా దుబారులో పని చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫైలింగ్‌లలో సైప్రియట్‌ జాతీయుడిగా పేర్కొనబడ్డారు. ముఖ్యంగా అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అంతర్జాతీయంగా వినోద్‌ పేరు బహిర్గతమైంది. మారిషస్‌, సైప్రస్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌, అనేక కరేబియన్‌ దీవులలో వీరికి సంబంధించి కొన్ని సంస్థలు గుర్తించబడ్డాయి. వినోద్‌ అదానీ పలువురు సన్నిహితులు, సహచరుల ద్వారా ఆఫ్‌షోర్‌ షెల్‌ కంపెనీలను నిర్వహిస్తున్నాడు అని తెలిసింది. ఈ సంస్థలు రహస్యంగా అదానీతో లావాదేవీలు జరుపుతాయి అని హిండెన్‌బర్గ్‌ పేర్కొన్నది. అయితే అదానీ గ్రూపునకు సంబంధించి సిమెంట్‌ సముపార్జన వివరాలను మాత్రం లోతుగా పరిశోధించాల్సి ఉన్నది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూపు స్పందించింది. వినోద్‌ అదానీ ఏ లిస్టెండ్‌ కంపెనీలు కానీ, వాటి అనుబంధ సంస్థల్లో కానీ నిర్వాహక పదవిని కలిగి లేరు అని వివరించింది. రోజువారీ వ్యవహారాల్లో ఎలాంటి పాత్రనూ కలిగి ఉండరు అని పేర్కొన్నది. అదానీ గ్రూపులో అతిపెద్ద సముపార్జనకు సంబంధించి వారి పేర్లు కనిపించడం చర్చకు దారి తీసింది. డొల్ల కంపెనీలే కాకుండా వాటిలో కుటుంబ సభ్యుల పేర్లను వాడుకొని అదానీ సాగించిన వ్యాపార గుట్టు బయటపడుతున్నదని మార్కెట్‌ నిపుణులు, విశ్లేషకులు అన్నారు.వినోద్‌ అదానీ ఎలాంటి అధికారిక పదవులను కలిగి ఉండకపోయినా, రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొననప్పటికీ.. అదానీ గ్రూపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధుల సేకరణ, వ్యూహాత్మక దిశను రచించడంలో ఆయన కీలక సంధానకర్త అని దేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన అదానీ గ్రూపు అంశంపై నిపుణుడు ఒకరు తెలిపారు. వినోద్‌ తన విషయాలను ఎక్కువ బయటకు రానీయకుండా చూసుకుంటాడనీ, కుటుంబ సభ్యులతో మాత్రమే నేరుగా వ్యవహరిస్తాడు అని చెప్పారు.బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ రుణాల సాయం, ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకోవడం, విదేశాల్లో రుణ ఎగవేతదారులకు ఆశ్రయం కల్పించే దేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటు.. వీటన్నిటికి మించి మోడీ సర్కారు నుంచి అందిన అండదండలు అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు చాలా దోహదం చేశాయని మార్కెట్‌ నిపుణులు అన్నారు. హిండెన్‌బర్గ్‌ పరిశోధిక నివేదిక నేపథ్యంలో విదేశాల్లో ఉన్న అదానీ గ్రూపునకు చెందిన డొల్ల కంపెనీలు, వ్యాపార భాగస్వాములపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. భారత్‌లో అదానీ గ్రూపు వంటి వ్యాపార సామ్రాజ్యాల్లో కుటుంబ సభ్యుల పాత్ర.. బ్యాంకులు, పెట్టుబడిదారులకు తలనొప్పిగా మారిందని చెప్పారు. వారు ఎవరితో వ్యాపారం చేస్తున్నారో, డబ్బు ఎక్కడికి ప్రవహిస్తున్నదో పూర్తిగా తెలుసుకోవడం కష్టతరమవు తున్నదని చెప్పారు. లిస్టెడ్‌ అదానీ గ్రూపు కంపెనీలలో తన షేర్‌ హోల్డింగ్‌ల ద్వారా ఒక బిలియనీర్‌ అని, సైప్రస్‌లో ఒక ఫైలింగ్‌లో ఆయన వయసు 74 ఏండ్లుగా అందులో పేర్కొనబడి ఉన్నది. అదానీ గ్రూపు అంటే వినోద్‌, గౌతమ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న మరో సోదరుడు రాజేశ్‌, అలాగే ఫ్యామిలీ ట్రస్టు వంటి ఇతర సంస్థలు అని అర్థం చేసుకోవాలని అదానీ అంశంపై అవగాహన కలిగి ఉన్న నిపుణులు అన్నారు. అనేక రుణ దాఖలాల్లో వినోద్‌ను కీలక వ్యక్తిగా చేర్చారు అని చెప్పారు. అన్ని విదేశీ లావాదేవీలను వినోద్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.. కాని ఆయన గురించి నాకు చాలా తక్కువ తెలుసు అని ఆన్‌.ఎన్‌. భాస్కర్‌ (గౌతమ్‌ అదానీపై కొత్త బయోగ్రఫీ రచయిత) అన్నారు.

Spread the love