85 శాతం మెడికల్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే

85 percent medical seats are for Telangana students–  రాష్ట్ర విభజనకు ముందున్న కాలేజీల్లోనే ఏపీ విద్యార్థులకు స్థానికత : హైకోర్టు కీలక తీర్పు
నవతెలంగాణ -హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు స్థానికత వర్తించదని హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందున్న కాలేజీల్లో మాత్రమే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 95 ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక కోటా అమలవుతుందని స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక పెట్టిన 34 మెడికల్‌ కాలేజీల్లో (20 గవర్నమెంట్‌, 14 ప్రయివేటు) 85 శాతం ఎమ్‌బీబీఎస్‌, డెంటల్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని తెలిపింది. మిగిలిన 15 శాతం ఆల్‌ ఇండియా కోటా ఉంటుందనీ, ఆ 15 శాతం సీట్లల్లోనే ఇతర రాష్ట్రాల విద్యార్థుల తరహాలోనే ఏపీ విద్యార్థులు పోటీపడొచ్చునని చెప్పింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ అత్యంత ముఖ్యమైన తీర్పు సోమవారం చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో జాతీయ కోటా (15శాతం) పోనూ మిగిలిన 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది.
కొత్త మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పూర్తి తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని చెప్పింది. జీవో 72ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 3న జీవో 72 తెచ్చింది. దీని ప్రకారం 2014, జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు అయ్యాయి. జాతీయ కోటా 15 శాతం మినహా మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఇవ్వడాన్ని సవాల్‌ చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఏపీకి చెందిన గంగినేని సాయి భావన సహా 60కిపైగా పిటిషన్లను కొట్టేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను పదేండ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే జీవో ఉందని చెప్పింది. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్‌ కాలేజీ మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్‌ అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. పునర్విభజన తర్వాత వచ్చిన 34 కాలేజీల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కాదు’ అని ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదిస్తూ తీర్పు చెప్పింది.

Spread the love