వీడని సస్పెన్స్‌…?

– కర్నాటక సీఎంపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం
– తుది ప్రకటన బెంగళూరులోనే…!
న్యూఢిల్లీ: కర్నాటక తదుపరి సీఎం ఎవరనే దానిపై మంగళవారం రాత్రి వరకూ కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. హస్తినలో ఎడతెరిపి లేకుండా సాగిన చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో బుధవారం వరకూ ఎంపికలో జాప్యం జరగవచ్చని తెలుస్తోంది. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఎవరికి వారే సీఎం పదవిపై పట్టుదలగా ఉండటంతో మధ్యేమార్గం సహా అన్ని రకాల మార్గాల్లోనూ వారితో అధిష్ఠానం మంతనాలు సాగిస్తోంది. తుది నిర్ణయం ఖర్గేకు అప్పగిస్తూ కర్నాటక సీఎల్‌పీ ఏకవాక్య తీర్మానం చేసినప్పటికీ ఖర్గే ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ప్రకటనలో జాప్యం జరగవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుది నిర్ణయానికి వచ్చేముందు సోనియాగాంధీ, రాహుల్‌ను మరోసారి ఖర్గే కలుసుకుంటారని, అనంతరం బెంగళూరులోనే సీఎం పేరు ప్రకటిస్తారని అంటున్నారు.

రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కలుసుకోవడంతో చర్చలు ఊపందుకున్నాయి. రెండురోజులుగా సిద్ధరామయ్య ఢిల్లీలోనే మకాం చేయగా, డీకే శివకుమార్‌ ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కేసీ వేణుగోపాల్‌, సూర్జేవాలాను కలుసుకున్నారు. అనంతరం ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ వెనువెంటనే సిద్ధరామయ్య సైతం ఖర్గేను కలిశారు. సంప్రదింపులు దాదాపు ముగిసినట్టేనని, రాహుల్‌, సోనియాగాంధీలను ఖర్గే మరోసారి కలుసుకుని తుది నిర్ణయానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారంనాటికి ఒక నిర్ణయానికి రావడం, వెంటనే ఆ నిర్ణయాన్ని బెంగళూరులోనే ప్రకటించడం జరుగుతుందని తెలుస్తున్నది.
ఆ వార్తలు అవాస్తవం..
కాంగ్రెస్‌ నాకు అమ్మలాంటిది: డీకేఎస్‌
కాంగ్రెస్‌ పార్టీ తనకు తల్లిలాంటిదని డీకే శివకుమార్‌ అన్నారు. ఆ పార్టీని తాము పునర్నిర్మించామని తెలిపారు. సీఎం ఎవరు కావాలనే అంశంపై నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమన్నారు. ఖర్గేను కలవడానికి ముందు డీకేఎస్‌ తన సోదరుడి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కర్నాటక కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి డీకేఎస్‌ రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే ఛానళ్లపై పరువు నష్టం కేసు పెడతానంటూ హెచ్చరించారు. అలాగే, ఈ ఉదయం ఆయన ఢిల్లీకి వెళేల ముందు… బెంగళూరులో మాట్లాడుతూ.. తాను ఎవరినీ వెన్నుపోటు పొడవనని.. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయనని చెప్పిన విషయం తెలిసిందే.

Spread the love