ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం

పట్టణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్‌
గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఉద్యమించాలని, పట్టణ పేదలకు ఉపాధి పనులు వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌.బాలమల్లేష్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. పని అమలౌతున్న గ్రామాలను కొత్తగా నగర పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కలిపి పట్టణం పేరుతో పనులు కల్పించడం లేదని చెప్పారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాదిరి పట్టణ పేదలకు కూడా ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం జరుగుతున్న దశలవారీ ఆందోళనలు, పోరాటాలలో కూలీలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంక ట్రాములు మాట్లాడుతూ.. దేశంలో ఈ చట్టం కింద పని కోసం జాబ్‌ కార్డులు పొందిన కూలీల్లో సగం మందికి కూడా పని చూపడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న దన్నారు. రాష్ట్రంలో 57.17 లక్షల జాబ్‌ కార్డులలో కోటి 20 లక్షల మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. కానీ రాష్ట్రంలో 36.73 లక్షల జాబ్‌ కార్డులలోని 65 లక్షల మంది కూలీలకు మాత్రమే పని కల్పించినట్టుగా గత సంవత్సర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయన్నారు. జాబ్‌ కార్డులలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని చట్టంలో ఉన్న డైరెక్షన్‌ను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2.64 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కూలీల జాబు కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నెంబర్లను లింక్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చిందన్నారు. పని ప్రదేశంలో ఉదయం 7 గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు మరోసారి ఫొటోలు దిగి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే వేతనాలు ఇస్తామన్న కొత్త నిబంధనలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం క్యూబిక్‌ మీటర్ల కొలతల పేరుతో చేసిన పనికి చట్ట ప్రకారం రూ.272 వేతనాలు చెల్లించకుండా కోత విధిస్తున్నదన్నారు. కూలీలకు ఇవ్వాల్సిన తట్ట, పార, గడ్డపార, కొడవలి, గొడ్డలి పంటి పనిముట్లురివ్వడం లేదన్నారు.
పని చూపని దగ్గర జాబ్‌ కార్డుదారులకు చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, జి. నర్సింహ్మ, కె.కాంతయ్య బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు, ఎస్‌.శివలింగం రాష్ట్ర కన్వీనర్‌ పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ, కె.మహాలక్ష్మి మహిళా రాష్ట్ర కన్వీనర్‌, పులి కల్పన డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఆరుణజ్యోతి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్‌, ఆర్‌. రాంనాయక్‌, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డీబీఎస్‌ ఆనంద్‌, రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love