పాతాళభైరవి సినిమా చూసిన వాళ్ళందరికీ హీరో తోటరాముడు దేవి విగ్రహాన్ని తాకి ”జై పాతాళ భైరవి” అనగానే ఒక దేవతా మూర్తి ప్రత్యక్షమై ”నరుడా ఏమి నీ కోరిక” అన్న డైలాగు ఇప్పటికీ మరపురాదు. ఆ వేషంలో కనిపించిన నటి కూడా అమాయకంగా చూసే చూపులతో ”తధాస్తు” అంటూ అదృశ్యమవడం ఆ తరం సినిమా అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. అలా తెరపై అరుదుగా కనిపిస్తూ అదృశ్యమయ్యే ఆ పాత్రను పోషించిన ఆ నటి ఆ తర్వాత తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప హాస్య నటిగా వెలిగిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ నటి దాసరి గిరిజ.
గిరిజ అనగానే ఆమె రేలంగితో కలిసి నటించిన చిత్రాలు మనకు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే తెరపై అత్యధిక చిత్రాలలో కామెడీ వేషాలతో ప్రేక్షకులను నవ్వించినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో మోసపోయి తన జీవితాన్ని అత్యంత దయనీయంగా చాలిస్తుందని తాను కూడా అనుకొలేదు.
తెలుగు సినిమారంగంలో హాస్యానికి ప్రాధాన్యత మొదలైంది 1950 దశకంలోనే. కామెడీ అన్నది సినిమా గెలుపుకు మూల సూత్రంగా కూడా మారింది. ఈ కాలంలోనే హాస్య నటీనటులకు డిమాండ్ మొదలైంది. చాలామంది హాస్యనటులు ఈ దశకంలోనే వెలుగులోకి వచ్చారు. అటువంటి వారిలో సరదాగా 18 నంబరు సంఖ్యగా చెప్పుకునే ‘రమణారెడ్డి-సూర్యకాంతం’ జంట, ‘రేలంగి – గిరిజ’ల జోడీలను ముందుగా చెప్పుకోవాలి. వీరు తమ కాలంలో ఒక హస్య శకాన్ని సష్టించారు.
గిరిజ తల్లి దాసరి రామతిలకం. తొలితరం సినిమా హీరోయిన్‌లలో ఒకరామె. దాసరి రామతిలకం రంగస్థలంపై ఈలపాట రఘురామయ్య, బందా, కపిలవాయి రామనాథ శాస్త్రి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు వంటి వారితో కలిసి ‘శ్రీకష్ణతులాభారం, శ్రీకష్ణ లీలలు, సతీ సక్కుబాయి’ వంటి నాటకాలలో నటించింది. ఆ కాలంలో రంగస్థలంపై పేరుగాంచిన నటీనటులనే సినిమాలలోకి ఎంపిక చేసుకునేవారు. ఆ క్రమంలో రామ తిలకం 1933లో వచ్చిన చింతామణిలో మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా వారి ‘సావిత్రి, శ్రీకష్ణ లీలలు ద్రౌపది వస్త్రాపహరణం’ వంటి సినిమాల్లో ప్రధానమైన వేషాలు వేసింది. ఎస్వీ రంగారావు మొదటి సినిమా ‘వరూధిని’లో హీరోయిన్ దాసరి రామతిలకమే. సినిమాలలో నటిస్తుండగానే 1937 జూన్‌లో కంకిపాడులో రామతిలకానికి గిరిజ జన్మించింది. తాను సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా ఉండటం వలన గిరిజ తన పెద్దమ్మ వద్ద పెరిగి పెద్దదయింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మద్రాసులో సినిమా రంగం కొద్ది కాలం పాటు స్తబ్దుగా మారిపోయిన సమయంలో రామ తిలకం తిరిగి గుడివాడ వచ్చి సొంత నాటక సమాజాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. యుద్ధానంతరం తిరిగి ఆమె మద్రాస్‌కు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసినా ఒకటి రెండు తప్ప ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇంతలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న గిరిజ మద్రాసులోని తల్లి వద్దకు వచ్చేసింది. ఆ సమయంలో గిరిజను చూసిన శివరావు తను తీస్తున్న ‘పరమానందయ్య శిష్యులు కథ’ (1950)లో అక్కినేని సరసన నటింపచేశాడు. ఇది ఆమె మొదటి సినిమా. అదే ఏడాది ‘అదష్టదీపుడు’లో కూడా ఒక చిన్న వేషం వేసిందామే.
నరుడా ఏమి నీ కోరిక…
1951లో విజయావారి మనీ స్పిన్నర్ తొలి జానపదం ‘పాతాళభైరవి’లో గిరిజ పాతాళ భైరవిగా నటించిన తర్వాతనే అందరి దష్టిలోకి వచ్చింది. ఆ తర్వాత పి. పుల్లయ్య తీసిన ‘ధర్మదేవత (1952)’లో హీరోయిన్‌గానే వేసింది. అంతకుముందు వినోదా వారి ‘స్త్రీ సాహసం, ఆడజన్మ (1951)’లో ప్రాధాన్యత గల వేషాలు వేసింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ‘కోడరికం’, తమిళంలో ‘మామియార్’లో నటించింది. 1952లో ‘నా ఇల్లు’, తమిళంలో ‘ఎన్ వీడు’, తెలుగులో ‘ప్రజాసేవ, లక్ష్మి (1953)’, కాంతారావు మొదటి సినిమా ‘ప్రతిజ్ఞ, వంజం (1953 తమిళం)’ లో హీరో చెల్లెలి వేషం వేసింది. ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్లో తమిళంలో తీసిన ‘మనోహర్ (1954)’ తెలుగులో ‘మనోహర’ చిత్రంలో శివాజీ గణేషన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇదే సినిమా హిందీలో కూడా విడుదలైంది. అయితే గిరిజకు ఆనాడు ఉన్న ఇతర లీడ్ హీరోయిన్స్ సావిత్రి, కష్ణకుమారి, బి.సరోజా దేవి, జమున, అంజలి వంటి వారి పోటీలో నిలువలేక రెండో ప్రాధాన్యత గల పాత్రలతో సరిపెట్టుకోవలసి వచ్చింది ఇంతలో రేలంగితో జతకలిసి హాస్య పాత్రల్లో పోషించడంతో ఆమె సినిమా జీవితం గొప్ప మలుపు తిరిగినట్లయింది. ‘అప్పు చేసి పప్పు కూడు, నమ్మిన బంటు, అన్నపూర్ణ, కులగోత్రాలు’ వంటి సినిమాలలో రేలంగితో కలిసి ఆమె చేసిన హాస్యవల్లరి తెలుగు సినిమా రంగంలో ఒక నూతన ట్రెండుకు శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలో గిరిజ ‘భలేరాముడుహొ(1956), భలే అమ్మాయిలు, దొంగల్లో దొర, పెళ్ళి కానుక (1957), ముందడుగుహొ(1958), రాజనందిని, మనోరమ, రాజా మలయసింహ, రేచుక్క పగటిచుక్క, ఇల్లరికం (కనకదుర్గగా), దైవబలం (1959), పెళ్ళికానుక, భట్టి విక్రమార్క, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, బాగ్దాద్ గజదొంగ, ఋణానుబంధం, కులదైవంహొ(1960), ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, భార్యాభర్తలు, వెలుగునీడలు (1961), సిరిసంపదలుహొ(1962), ఆరాధన, పరువు ప్రతిష్ఠ, బందిపోటు, ఈడు జోడు, లవకుశ (1963), రాముడు-భీముడుహొ(1964), ప్రేమించి చూడు, మంగమ్మ శపథం, సత్యహరిశ్చంద్ర, సుమంగళి (1965), నవరాత్రి (1966), ఆస్తిపరులు, రహస్యం, భామావిజయం, అమాయకుడు, భేతాళ మాంత్రికుడు, ఆస్తిపరులు (1967), ఆడదాని అదృష్టంహొ(1974), జీవిత నౌక (1977)’ తదితర తెలుగు చిత్రాల్లో ఆమెనటన అసన్య సామాన్యం.
రేలంగిరిజ…
గిరిజ ‘ఆరిందా’ పాత్రపోషణలో హాస్యాన్ని బాగా పండించింది. కనురెప్పలను వేగంగా ఆడిస్తూ లేడికన్నులతో ప్రేక్షకును గిలిగింతలు పెట్టేది ఆమె నటన. ‘జగదేశ వీరుడు’లో ఏకాశ పాత్రలో గిరిజ మరుపు రాదు. 1960 దశకం దాక ఆమె చక్కటి హస్య పాత్రలు పోషించింది. ముఖ్యంగా రేలంగి నటించిన చిత్రాల్లో ఆమె తప్పనిసరిగా నటించాల్సిందే. ఒక దశలో వీరిరువురి హాస్యం దర్శక నిర్మాతలకు బాక్సాఫీస్ సూత్రమై కూర్చున్నదంటే వీరి నటన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకునేదో చెప్పవచ్చు. ముళ్ళపూడి వెంకటరమణ గారు వీళ్ళిద్దరి జోడిని ‘రేలంగిరిజ’ అనీ సరదాగా రాసేవారు.
వీరిద్దరి పాటలు ఆరోజుల్లో బహుళ జనాదరణ పొందినవి. రాముడు భీముడు సినిమాలో ”సరదా సరదా సిగరెట్టు” పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ సాంగ్. ‘అప్పు చేసి పప్పు కూడు’లో ”కాశీకి పోయాను రామా హరే” పాట నేటికీ సినీ ప్రేక్షకుల అభిమాన గీతమే.
ఆరాధనలో ”ఓహో మామయ్య ఇదేమయ్యా”, వంటి పాటలు వారి కాంబినేషన్‌కు మరపురాని గుర్తులుగా మిగిలిపోయినవి. ‘ఆరాధన’ సినిమాలో గిరిజ, రేలంగి జంటకు రెండు యుగళగీతాలు పెట్టడం ఆ రోజుల్లో వీరి జంటకు ఉన్న ప్రజాదరణను రుజువు పరుస్తుంది. కొన్ని సినిమాలలో పద్మనాభంతోను చలంతో కూడా ఆమె జోడిగా నటించింది.
గిరిజ హాస్య నటి మాత్రమే కాదు. హీరోయిన్‌గా కూడా నటించింది. 1958లో వచ్చిన ‘అత్తా ఒకింటి కోడలే’లో జగ్గయ్య సరసన, ‘కలవారి కోడలు, మంచి మనసుకు మంచి రోజులు చిత్రాలలో ఎన్టీ రామారావుకు జోడిగా నటించింది. ఇంకా గిరిజ నటించిన చిత్రాలలో ‘భార్యాభర్తలు, భలే అమ్మాయిలు, భలే రాముడు, భలే బావ, ఎం.ఎల్.ఏ., రుణానుబంధం, వెలుగునీడలు, కులదైవం, రుష్యశృంగ, టాక్సీ రాముడు, శభాష్ రాజా, టైగర్ రాముడు, ఆరాధన, ఆత్మ బంధువు, అనురాగం, మైరావణ, వారసత్వం, లక్షాధికారి’ వంటి సినిమాలలో మరుపురాని భూమిక పోషించింది. గిరిజ హస్యనటిగా సుమారు 250కి పైగా తెలుగు చిత్రాల్లోనేగాక కన్నడ, తమిళ, మళయాళ, హిందీ భాషా చిత్రాల్లో నటించిన బహుభాషానటి.
అయితే ఆమె సినిమా రంగంలో మంచి స్థాయిలో ఉన్నప్పుడే పెద్దలు ఆమె వివాహం సన్యాసి రాజుతో జరిపించారు. తన భర్త కోసం సొంత నిర్మాణ సంస్థ విజయగిరిధ్వజ ప్రొడక్షన్స్ పేరున స్థాపించి, 1969లో ‘భలే మాస్టారు’ 1971లో ‘పవిత్ర హదయాలు’ సినిమాలను నిర్మించింది. దురదష్టవశాత్తు ఈ రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో గిరిజ జీవితం తలకిందులయిపోయింది. పైగా నయాపైసా సంపాదించని భర్త, గిరిజ సంపాదనను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. వ్యసనాలకు బానిసై డబ్బంతా మంచినీళ్ళప్రాయంలా ఖర్చు చేశాడు. అప్పటిదాకా ఎలాంటి చీకూ చింతలేని గిరిజ వివాహం తర్వాత కష్టాల ఊబిలో మునిగిపోయిందని అర్థం చేసుకున్నది. కానీ ఆమె పునర్వైభవానికి రావడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అప్పటికే పరిశ్రమలోకి కొత్త కామెడీ జంటలు చలం, పద్మనాభం, గీతాంజలి, రమాప్రభ వంటి వారి రాకతో గిరిజ ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు ఇంట్లో ఉన్నదంతా ఒకనాడు ఊడ్చుకుని చెప్పా పెట్టకుండా భర్త బయటికి వెళ్లిపోయాడు. ఇది గిరిజను మరింతగా కృంగదీసింది. అయినా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతూ వచ్చింది. అప్పటిదాకా ఉన్న బంగ్లాలు, కార్లు అన్నీ కూడా మాయమైపోయినవి. నిర్మాతగా ఆమె ఇతరులకు గ్యారెంటీ ఇవ్వడంతో ఆస్తులను అమ్మి అప్పుల్ని తీర్చవలసి వచ్చింది. గిరిజకు ఏకైక సంతానం శ్రీగంగ. తర్వాత ఆమె తన పేరును సలీమాగా మార్చుకుంది. శ్రీగంగ కూడా బాలనటిగా ‘మేఘసందేశం’లో నటించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవకాశాలు వెంట వెంట రాలేదు. ఇంతలో 1995 ఫిబ్రవరి 24న తల్లి తిలకం కన్నుమూయడంతో గిరిజ ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయింది. చిన్నప్పటినుండి తల్లి చాటు బిడ్డగా పెరిగిన ఆమెను తల్లి మరణం మరింత కృంగదీసింది. ఆ బెంగతోనే గిరిజ మద్రాసులో 1995 సెప్టెంబర్ 5న ఆకస్మాత్తుగా ఇంట్లోనే గుండెపోటుతో చనిపోయింది. అయితే ఆమె చివరి రోజుల్లో ఆర్థికంగా ఆదుకొమ్మని సినిమా వాళ్ల ఇంటికి వెళ్లి అడిగేదని కొందరు, మరికొందరేమో ఆమె అనాధగా ఒక బస్టాండ్లో కన్నుమూసిందని అంటారు. కానీ ఆమె కూతురు శ్రీగంగ ఈ వదంతుల్ని ఒక ఇంటర్వ్యూలో కొట్టి పారేసింది.
గిరిజ నటిగా నేటితరం వారికి చాలా మందికి తెలియకపోయినా తొలి, మలితరం సినిమా ప్రేక్షకులకు ఆమెనటన మరపురాదు. సహజ నటనకు నిర్వచనం ఆమె. అమాయకపు చూపులు, చలాకి నవ్వులు, వెండితెరపై లేడీ పిల్లలా గంతులు వేసిన గిరిజ వైవాహిక జీవితంలో కష్టనష్టాలనుభవించి విషాదభరితంగా బతుకు పయనాన్ని ముగించింది.
హెచ్ రమేష్ బాబు,
7780736386



