రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, పండ్ల సరఫరా ఆపేశారు
11వ రోజు దిగొచ్చిన సర్కార్.. సమస్యలు పరిష్కారం
ఒక్కో డిమాండ్‌ను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం
2026లో మూడు జిల్లాల్లో
50 వేల చొప్పున రైతులతో పాదయాత్రలు
నవంబర్‌లో హైదరాబాద్‌లో ఏఐకేఎస్ ఆలిండియా మహాసభలు : ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ ధావలే
కొత్తగూడెం నుంచి అచ్చిన ప్రశాంత్
కొత్త పంథాలో మహారాష్ట్ర రైతు ఉద్యమాలు, పోరాటాలను ముందుకు తీసుకెళ్తున్నామనీ, ఈ విషయంలో రైతులు విజయవంతం అవుతున్నారని ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో నవంబర్ నెలలో ఆలిండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరుగబోతున్నట్టు ప్రకటించారు. గతంలో ఖమ్మం, గుంటూరు ప్రాంతాల్లో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరిగాయనీ, ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగబోయే మహాసభల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఏఐకేఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సామినేని రామారావు నగర్‌లోని కాసాని అయిలయ్య ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో మహాపాదయాత్రలు నిర్వహిస్తున్నామనీ, పెద్ద ఎత్తున రైతులను సమీకరించి హక్కుల కోసం పోరుబాట పట్టించడంలో ఏఐకేఎస్‌గా విజయవంతం అవుతున్నామని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో తమ పోరాటాలు పోల్చదగినవి కావని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తేబాగా, ఉన్నప్రవాయిలార్ పోరాటాల స్ఫూర్తితో తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2017లో రైతు సంఘాల ఐక్యవేదిక, ఏఐకేఎస్‌గా 10 రోజుల పాటు రైతుల సమ్మె చేశామని తెలిపారు. తొలుత ఇది రైతుల సమ్మె కాదని పాలకులు కొట్టిపడే ప్రయత్నం చేశారనీ, వరుసగా పది రోజుల పాటు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాల సరఫరాను నిలిపివేయడంతో 11వ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఆ పోరాట ఫలితంగా రూ. 40 వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. ఆ తర్వాత 2018లో కిసాన్ సభ ఆధ్వర్యంలో 200 కిలోమీటర్లకుపైగా కిసాన్ లాంగ్‌మార్చ్ నిర్వహించామని గుర్తుచేశారు. పురుషులతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తమ కాళ్లకు రక్తాలు కారుతున్నా, కాళ్లకు బొబ్బలు వచ్చినా పట్టుదలతో నడిచారని వివరించారు. ఆ లాంగ్ మార్చ్‌కు ముంబయిలో కార్మికులు, మధ్యతరగతి ప్రజలు స్వాగతం పలికి రైతులకు, వారి పిల్లలకు, మహిళలకు చెప్పులు, పండ్లు, ఆహారపదార్థాలు అందజేశారని వివరించారు. ఆ లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎంతో పాటు ఐదుగురు మంత్రులు రైతులతో చర్చలు జరిపారనీ, రాతపూర్వక హామీలు ఇస్తామని చెబితే రైతులు తిరస్కరించారని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేయడంతో శాసనసభ, శాసనమండలిలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎన్ని రోజుల్లో నెరవేర్చుతామనే విషయాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. అందులో కొన్ని డిమాండ్లను నెరవేర్చిందనీ, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అయితే, అంతిమంగా రైతులకు విజయం దక్కేదాకా పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పారు.
రైతుల పక్షాన పోరాడే అతి పెద్దసంఘంగా ఏఐకేఎస్‌కు గౌరవం
ఆ పోరాటాల ద్వారా మహారాష్ట్రలో రైతుల పక్షాన కొట్లాడే అతి పెద్ద సంఘం ఏఐకేఎస్ అనే గౌరవం దక్కిందని తెలిపారు. 2026లో థానే-పాల్ఘర్, నాసిక్, అకోలా మూడు మహాపాదయాత్రలను కలెక్టరేట్ల వరకు నిర్వహించామనీ, ప్రతిజిల్లా పాదయాత్రలోనూ 50 వేల మందికి పైగానే రైతులు పాల్గొన్నారని వివరించారు. ఇటీవల తెలంగాణ సరిహద్దులోని జిల్లాలోనూ 500 మంది రైతులతో కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాలు, పాలకులు వారు వ్యవహరిస్తున్న తీరును ఇతర వర్గాల వారికి తెలిసేలా చేయడంలోనూ, ఆ డిమాండ్లను నెరవేర్చు కోవడంలోనూ విజయం సాధించామని తెలిపారు. రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లోనూ చేపట్టిన రైతు ఉద్యమాల ద్వారా విజయాలు సాధించగలిగామని వివరించారు. ఆ తరహాలో తెలంగాణలోనూ రైతాంగ ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మహిళలు పాల్గొన్న ప్రతి పోరాటం విజయవంతం :ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి
దేశంలో మహిళలు పాలుపంచుకున్న ప్రతి పోరాటం కూడా విజయవంతమైందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో సామినేని రామారావు నగర్ లోని కాసాని అయిలయ్య ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ఆమె సౌహార్ద సందేశాన్ని ఇచ్చారు. వ్యవసాయ రంగానికి, మహిళలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఆదిమ సమాజంలోనే మహిళలు వ్యవసాయాన్ని కనిపెట్టారని తెలిపారు. మహిళలు ఇంట్లో, వ్యవసాయ పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో నూటికి 70 శాతం ఉండేవారనీ, నేడు 48 శాతమే ఉన్నారని తెలిపారు. మహిళలు పాల్గొన్న ప్రతి ఉద్యమం కూడా విజయవంతం అవుతుందన్నారు. మూడు నల్లచట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తుంటే వారి భార్యలు వ్యవసాయ పనులు చూసుకు న్నారనీ, తమ భర్తలను విజయం సాధించేదాకా ఇంటికి రావొద్దని స్ఫూర్తిని ప్రదర్శించడం గొప్ప విషయమని కొనియాడారు. వ్యవసాయాన్ని దివాళా తీసేలా మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నదని విమర్శించారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మహిళలపై దాడులు జరుగుతుంటే మోడీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశానికి ప్రమాదకరమనీ, కార్మికులు, కర్షకులు, మహిళలు ఐక్యంగా పోరాటాలు చేస్తేనే మోడీ సర్కారును వెనక్కి కొట్టగలుగుతామనీ, ఆ దిశగా పోరాట కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు.
పోరాటాల గడ్డ తెలంగాణ ఈ నేల నుంచి మరిన్ని స్ఫూర్తిదాయక పోరాటాలు రావాలి : ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
తెలంగాణ గడ్డ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన నేల అని అది ఆసియాలోనే అత్యంత విప్లవాత్మక, గొప్ప పోరాటమనే పేరుందని ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సామినేని రామారావు నగర్‌లో గల కాసాని అయిలయ్య ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం వ¶డో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డ నుంచి మరిన్ని స్ఫూర్తిదాయక పోరాటాలు రావాలని ఆకాంక్షించారు. కోవిడ్ సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో మహోత్తరమైన రైతాంగ పోరాటం ద్వారా మోడీ సర్కార్‌ను రైతులు వెనక్కి కొట్టారనీ, దాంతో వ¶డు చట్టాలు రద్దు అయ్యాయనీ, అందులో ఏఐకేఎస్ పాత్ర కీలకమని చెప్పారు. ఎయిర్ పోర్టుకు పలు అభివద్ధి పనులకు కర్నాటకలో ప్రభుత్వం భూములు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ఏఐకేఎస్ బలమైన పోరాటం చేసి ఆ రైతులకు 1400 ఎకరాల భూములను తిరిగి ఇప్పించిన ఘనత ఉందని చెప్పారు. రాజస్తాన్, మహారాష్ట్రలలో రైతంగ పోరాటాలు బలంగా జరుగుతున్నాయని చెప్పారు. మోడీ రైతులకు ఇచ్చిన హామీలపైన, పదివేలల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ పైన నిరంతర పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారని ఈ నేపథ్యంలో ఏఐకేఎస్ నాయకత్వంలో మహిళల పాత్ర మరింత పెరగాలని సూచించారు.
ఏలూరి లక్ష్మినారాయణకు మహాసభ నివాళి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన ఏలూరి లక్ష్మినారాయణకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ నివాళి అర్పించింది. లక్ష్మినారాయణ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నేతలు సారంపల్లి మల్లారెడ్డి, జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ..కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, అశ్వరావుపేట ప్రాంతాల్లో ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణంలో లక్ష్మినారాయణ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభ లకు వెళ్లి అక్కడ గుండెపోటుతో ఆయన మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన చివరి వరకు ఉద్యమ నిర్మాణం కోసమే పని చేశారని కొనియాడారు.
రాయల, సారంపల్లి, అరిబండి, గూడూరులకు మహాసభ సన్మానం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు ప్రతినిధులుగా హాజరైన అతి పెద్ద వయస్సు కలిగిన వారి సేవలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి టి.సాగర్ గుర్తుచేశారు. రైతు సంఘం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సారంపల్లి మల్లారెడ్డి-భాగ్యలక్ష్మి దంపతులను ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ సన్మానించారు. రాయల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు, గూడూరు అంజిరెడ్డిలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సన్మానించారు.



