ఆర్టీసీ సమ్మె విరమణపై కార్మికుల్లో చర్చోపచర్చలు
ముచ్చటగా మూడింటికి గ్రీన్‌సిగల్
పెండింగ్ సమస్యలపై సోమవారం నుంచీ చర్చలు ?
నెలరోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు శనివారం మళ్లీ రోడ్డెక్కాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈనెల 22న ప్రారంభమైన సమ్మె మూడు రోజుల్లోనే ముగియడంతో సాధారణ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లోని సుమారు 10 వేల బస్సులు సమ్మెలోకి వెళ్లాయి. తద్వారా 39 వేల మంది కార్మికులు తమ సమస్యలపై తాడో పేడో తేల్చుకునే ప్రయత్నం చేశారు. సుమారు 65 లక్షల మంది ప్రయాణికులపై ఈ సమ్మె ప్రభావం పడింది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యా వ్యవహారం సర్కారుపై ఒత్తిడి పెంచింది. చర్చలకు పిలవక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ సమ్మె నేపథ్యంలో అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఆర్టీసీ పరిరక్షణతోపాటు ఉద్యోగులకు పీఆర్సీ, ప్రభుత్వంలో విలీనం, సంఘాల పునరుద్ధరణతోపాటు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సర్కారు సానుకూలంగా స్పందించి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. మొత్తం 32డిమాండ్లకుగాను మూడింటిని పరిష్కరించి మిగతా 29సమస్యలను ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇటు ఆర్టీసీకి, అటు కార్మిక సంఘాలకు సూచించింది.
ఇదిలావుండగా ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలో సమ్మె విరమణ కార్మికుల్లో కొంత సంతోషాన్ని ఇవ్వగా, మరికొంత అసంతృప్తినీ మిగిల్చింది. పీఆర్సీని కనీసంగా 30 శాతం సాధించాలనుకున్న జేఏసీ, ఇతర సంఘాలు, కేవలం 11 శాతానికి ఒప్పుకోవడంతో కార్మికుల్లో ఒకింత ఆందోళన, అసంతృప్తి నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తం సమస్యల్లో మూడింటిని ప్రభుత్వం పరిష్కరించినా మిగతా వాటిని కొలిక్కి తేవడం అంత సులభం కాదనే భావన అధికార, కార్మిక వర్గాల్లో కనిపిస్తున్నది. సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతున్నది. ఈవీ బస్సుల కొనుగోళ్లు, నిర్వహణ ఆర్టీసీ ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని కార్మికులు అంటున్నారు. ఈవీ విధానం మూలంగా కార్మికుల ఉద్యోగాలకు ప్రమాదం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నా, కార్మికుల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఇప్పటికే ఈవీ బస్సులు ఆర్టీసీ డిపోలను ఆక్రమిస్తున్నాయి. అవి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులను డిపోల నుంచి బయటకు పంపేస్తున్నారు. అలాగే ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డిపోల నుంచి ఇతర రీజియన్లల్లో డిపోలకు ఉద్యోగులను బదిలీ చేసేందుకు నోటిఫికేషన్ సైతం ఇచ్చేశారు. కేటగిరైజేషన్ పేర ఈ తంతుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే శ్రీకారం చుట్టంది. అప్పుడప్పుడు కారుణ్య నియామకాలు మినహా శాశ్వత రిక్రూట్‌మెంట్ లేకుండాపోయింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈవీ బస్సులను భారీఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెడుతూనే, పాత ఆర్టీసీ బస్సులు రెట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియను సైతం ఆర్టీసీ చేపట్టింది. ఈ పరిణామాల పట్ల కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఆర్టీసీ ఆస్తులతోపాటు బస్సులను కాపాడుకోవాలనే ధీమా వారిలో కనిపిస్తున్నది. కాగా గత రెండు మూడు రోజులుగా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఒక నివేదికను సైతం ప్రచారంలోకి తెచ్చింది. ఆర్టీసీకి, కార్మికులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగిన సహకారం, ప్రయోజనాలు చెప్పడమే ఈ నివేదిక ఉద్దేశంగా కనిపిస్తున్నది. కార్మికుల్లో సమ్మె నుంచి ఏమీ ఆశించనివారు మాత్రం ప్రభుత్వ స్పందన పట్ల సంతోషంగా ఉన్నారు. అలాగే భారీగా ఆశించి భంగపడ్డవారు కూడా లేకపోలేదని సమాచారం. ఇదిలావుండగా సోమవారం నుంచి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ, ఆర్టీసీ జేఏసీలోని ఆరు కార్మిక సంఘాలతోపాటు బయట ఉన్న ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాయి. మంత్రులతో జరిగిన చర్చలు చాలా స్వల్పమనీ, ఇక ఆర్టీసీ యాజమాన్యంతో జరిగే చర్చలు కీలకమనే సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొన్నది. డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య పరిస్థితి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీంతో సర్కారు వేగంగా కదిలి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింప జేసిందనే ప్రచారం ఉంది. బస్‌భవన్‌లో జరిగే చర్చల్లో అన్నీ కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామనీ జేఏసీ చైర్మెన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మెన్ థామస్‌రెడ్డి, టీఎంయూ నేత అశ్వత్ధామరెడ్డి చెప్పారు. సోమవారం నుంచే చర్చలు ప్రారంభించాలనీ, అన్నీ కార్మిక సంఘాలు ఐక్యంగా చర్చల్లో పాల్గొని సత్ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి విఎస్.రావు అభిప్రాయపడ్డారు.
మోదం…ఖేదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



