ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత బిమన్‌బసు.. యువత భుజం తడుతూ ముందుకు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వామపక్ష కోటగా విలసిల్లిన పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది పదులు దాటినా సీపీఐ(ఎం) అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బిమన్‌బసు ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి దశ ప్రచారం ముగిసినా.. మలిదశలోనూ విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న ఆయన తీరు ఆకట్టుకుంటోంది.
టీఎంసీ అవినీతి, అణచివేత పాలనను ఓడించాలని, బీజేపీ మతతత్వ రాజకీయాలను చిత్తు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నేత, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు ప్రజలకు పిలుపు ఇచ్చారు. నవపారా నియోజక వర్గంలోని శ్యామ్‌నగర్ చౌరంగి వద్ద సీపీఐ(ఎం) నిర్వ హించిన ఎన్నికల ర్యాలీకి లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు నేతత్వం వహించారు. ఓపెన్ టాప్ జీపులో బిమన్ బసు ప్రజలతో చేతులు ఊపుతూ, చప్పట్లుకొడుతూ కార్యకర్త ల్లో ఉత్సాహం నింపారు. సీనియర్ నాయకులు రబిన్ దేబ్, తారిత్ బరన్ తోప్‌దార్, సిపిఎం అభ్యర్థి గార్గీ చటర్జీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎర్రజెండాలు, ఎర్ర బెలూన్లతో వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీని వీక్షించడానికి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
‘తృణముల్, బీజేపీలను గద్దెదించండి; బెంగాల్‌ను కాపాడండి’ అనే నినాదం ర్యాలీలో ప్రధానంగా వినిపించింది. శ్యామ్‌నగర్ చౌరంగి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి పాల్టా బస్ స్టాండ్ వద్ద ముగిసింది. ర్యాలీ అనంతరం రబిన్ దేబ్, తోప్‌దార్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తృణముల్ అవినీతి పాలన, అణచివేత వైఖరి బెంగా ల్‌ను ఎలా నాశనం చేస్తు న్నాయో, బీజేపీ మతతత్వ రాజకీ యాల వల్ల పొంచి ఉన్న ప్రమా దాన్ని ఆ నాయ కులు వివరిం చారు. ర్యాలీ, నాయ కుల ప్రసంగాలు ముగిసిన తరువాత బిమన్ బసు తిరిగి వెళ్లారు. జులై 1న బిమన్‌బసు 86వ ఏట అడుగుపెట్టను న్నారు. వయసుతో పాటు తగ్గని పోరాట స్ఫూర్తితో బిమన్ దా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థుల కోసం నిర్వహించే రోడ్ షోలు, పాదయాత్రలలో బిమన్‌బసు యువతను ఉత్సాహపరుస్తున్నారు.
బిమన్ బసు పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అనేక ఎన్నికలలో సీపీఐ(ఎం) ప్రచారానికి నాయకత్వం వహించిన బిమన్ బసు, ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. 1980లో బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నాయకత్వం కోరుకున్నప్పటికీ, బిమన్ బసు పార్టీ నిర్మాణ పనుల్లోనే కొనసాగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ తొలి అఖిల భారత కార్యదర్శి అయిన బిమన్ బసు, 1971లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలో సభ్యుడయ్యారు. 1978లో రాష్ట్ర సచివాలయంలో సభ్యుడయ్యారు.
1983లో కేంద్ర కమిటీకి ఆహ్వానించ బడ్డారు. 1998లో పొలిట్‌బ్యూరోలో సభ్యుడయ్యారు. అదే సంవత్సరం, ఆయన బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ అయ్యారు. 2005 నుంచి 2015 వరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీకి ఆహ్వానితుడైన బిమన్ బసు, అలీముద్దీన్ వీధిలోని రాష్ట్ర కమిటీ కార్యాలయంలో నివసిస్తున్నారు.
ముఫ్పై ఏండ్లు రాగానే నీరసించి పోయే రోజులివి. ఎండ తీవ్రంగా ఉంటే బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాంటిది 85 ఏండ్ల వయస్సులోనూ ఆయనలో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఎన్నికల ప్రచారంలో ఉరకలేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు సీపీఐ(ఎం) సీనియర్ నేత బిమన్‌బసు.



