సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డికి ఫెడరేషన్ విజ్ఞప్తి
ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులపై చొరవచూపాలని సూచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార్‌భవన్‌లో స్పెషల్ కమిషనర్‌ను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గత 40 ఏండ్లుగా తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై అవగాహన ఉన్న స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి ఇండ్లస్థలాలు పరిష్కరించే విషయంలో చొరవచూపాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు అందోళనతో ఉన్నారనీ, ప్రింటింగ్ కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లో అవసరమైన మేర అక్రిడిటేషన్ కార్డులను జారీచేయాలని కోరారు.
హెల్త్‌కార్డులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాలనీ, జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం కల్పించాలనీ, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని కోరారు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసిన నేపథ్యంలో వేజ్‌బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు సరిపోవనీ, నిధులు పెంచడం ద్వారా ఎక్కువ మంది జర్నలిస్టులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని మీడియాలో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ వేయాలని సూచించారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



