Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ 'రైతుసభ'

6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ‘రైతుసభ’

- Advertisement -

హాజరు కానున్న కేటీఆర్‌
డిక్లరేషన్‌ పేరుతో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతు డిక్లరేషన్‌ పేరుతో చేసిన మోసంపై వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సమావేశాన్ని నిర్వహించారు. వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను ఆ జిల్లా నేతలు ఆహ్వానించారు. ఆ సమావేశానికి హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ పేరుతో నాలుగేండ్ల కింద అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రెండున్నరేండ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన కపట మోసాన్ని కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్‌ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో తెలంగాణ రైతన్నలను మోసం చేశారని గుర్తు చేశారు.

మే ఆరో తేదీని పురస్కరించుకుని, కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్‌ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతాంగానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని పార్టీ నేతలు కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వెల్లడించారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు వంటి అంశాలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ నేతలకు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు.

త్వరలో జరగనున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని కేటీఆర్‌ సూచించారు. ప్రతి బూత్‌లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కోరారు. ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకుని కొత్త ఓటర్లను నమోదు చేయించడంతోపాటు ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. రైతు డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ ప్రకటించిన వరంగల్‌లోనే రైతులకు అండగా వచ్చేనెల ఆరో తేదీన రైతు సభ పెట్టాలని నిర్ణయించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -