Friday, May 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనీటి వనరులే టార్గెట్‌

నీటి వనరులే టార్గెట్‌

- Advertisement -

పైపులు ధ్వంసం, బావులు బ్లాక్‌
వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ సెట్లర్ల అమానవీయ తీరు

పాలస్తీనీయులకు నీటి కటకట
గాజా : పాలస్తీనియుల పట్ల ఇజ్రాయిలీ సెట్లర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి తాగడానికి నీరు కూడా లేకుండా చేస్తున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ సెట్లర్లు నీటి వనరులు, పైపులు, బావులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు పెంచారు. దీంతో పాలస్తీనియన్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వారి జీవనోపాధి, వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో ఇజ్రాయిలీ సెట్లర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువులు, పంటలకు తీవ్ర నష్టం ఐన్‌ సమియా పంపింగ్‌ స్టేషన్‌ సుమారు 20కి పైగా గ్రామాలకు, దాదాపు లక్ష మంది పాలస్తీనియులకు నీటిని సరఫరా చేస్తుంది. అయితే ఈ కీలక కేంద్రం ఇజ్రాయిలీ సెట్లర్ల దాడులకు పదేపదే గురవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దీనిపై కనీసం పది సార్లు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల వల్ల నీటి సరఫరా గంటల తరబడి, రోజుల పాటు నిలిచిపోతోందని చెప్తున్నారు. పశువులు, పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే వర్షపాతం తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో వాతావరణ మార్పులతో సమస్య మరింత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్‌కు సముద్రజలాలను తాగునీటిగా మార్చే టెక్నాలజీ (డిసాలినేషన్‌) ద్వారా నీటి సమృద్ధి ఉన్నప్పటికీ.. ఆ ప్రయోజనం పాలస్తీనియన్లకు అందడం లేదు.

నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి
1967 నుంచి ఈ ప్రాంతంపై నియంత్రణ కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌.. 1995 ఒప్పందాల ప్రకారం పశ్చిమ తీరంలోని నీటి వనరులలో సుమారు 80 శాతంపై ఆధిపత్యం కలిగి ఉంది. దీంతో పాలస్తీనియన్లకు నీటి తిప్పలు తప్పడం లేదు. వారు తమ అవసరాల కోసం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతేకాక, కొత్త నీటి మౌలిక వసతులు నిర్మించడానికి లేదా మరమ్మతు చేయడానికి కూడా అనుమతులు చాలా అరుదుగా ఇస్తారనీ, దీంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని నిపుణులు చెప్తున్నారు.

జీవన విధానం, సంస్కృతిపై ప్రభావం
2023 అక్టోబర్‌ 7 దాడుల తర్వాత పాలస్తీనియులపై ఇజ్రాయిలీ సెట్లర్ల హింస మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. నీటి వనరులపై దాడులు 2021లో 57 ఉండగా.. 2025లో 387కు పెరిగాయి. ఇజ్రాయిల్‌ అధికారులు మాత్రం ఈ ఆరోపణ లను ఖండిస్తూ.. నీటి సరఫరా బాధ్యత పాలస్తీనియన్‌ అథారిటీదే అని అంటున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నీటి నియంత్రణ భూమిపై ఆధిపత్యం సాధించడానికి ఉపయోగిస్తున్న ఒక సాధనంగా మారింది. నీటి కొరతతో జీవన విధానం, సంస్కృతి, జీవనోపాధి అన్నీ ప్రభావితమవుతున్నాయని అంటున్నారు. దీంతో ఇజ్రాయిలీ సెట్లర్ల అమానవీయ చర్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వినియోగంలో తీవ్ర అసమానతలు
ఇక నీటి వినియోగంలో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. ఒక ఇజ్రాయిలీ వ్యక్తి రోజుకు సగటున 247 లీటర్ల నీటిని వినియోగిస్తే.. పాలస్తీనియన్లకు అది సుమారు 82 లీటర్లకే పరిమితం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక కొన్ని గ్రామాల్లో ఇది 26 లీటర్లకు కూడా పడిపోతుండటం ఆందోళనకరం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన ప్రమాణాల కంటే తక్కువ కావడం గమనార్హం.

వ్యవసాయానికి ఇబ్బందులు
పాలస్తీనియన్ల గ్రామాల్లో నీటి సరఫరా అనిశ్చితంగా ఉండటంతో ఇండ్లపై ట్యాంకులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. చాలా మంది ఖరీదైన ట్యాంకర్‌ నీటిపై ఆధారపడుతున్నారు. బర్దాలా గ్రామంలో రైతులు తమ బావులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సెట్లర్లు తమ భూములను కంచె వేసి మూసివేసి, రహదారులను అడ్డుకోవడంతో వ్యవసాయం దెబ్బతింటోంది. కొంత మంది రైతులు తమ భూములు వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -