Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండబుల్‌ బెడ్రూం ఇండ్లకు

డబుల్‌ బెడ్రూం ఇండ్లకు

- Advertisement -

గ్రీన్‌ చానెల్‌లో నిధులు
ఈనెలాఖరు నాటికి 2 బీహెచ్‌కే ఇండ్ల కేటాయింపు
అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.ఐదు లక్షలు అందజేస్తాం
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేదు
సరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలి
రెవెన్యూ, ఫారెస్టు జాయింట్‌ సర్వే చేపట్టాలి : ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈనెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని అధికారులను రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని రూ.ఐదు లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్రూంలను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకు న్నామని అన్నారు. ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్‌ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హిమా యత్‌నగర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, కరీంనగర్‌ ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌ బాబు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హెచ్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలకు పాల్పడితే సర్వీసు నుంచి తొలగిస్తాం
అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయాలనీ, విద్యుత్‌, మంచినీరు, డ్రైనేజి, రోడ్లు వంటి కనీస వసతులు కల్పించాలని చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారనీ, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలనీ, అర్హులకు ఇండ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశిం చారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వా మ్యులను చేయాలని సూచించారు. రూ.400 కోట్లతో 2 బీహెచ్‌కే కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు తీసుకుని అక్కడ నివసించని వారి ఇండ్లను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 2 బీహెచ్‌కే బిల్లుల చెల్లింపుల్లో, అక్రమాలకు పాల్పడితే సస్పెండ్‌తో సరిపెట్టనని సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని అధికారులను ఆయన హెచ్చరించారు.

డబుల్‌ బెడ్రూం ఇండ్లలో నివసించకుంటే వేరే వారికి ఇస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేననీ, ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 దరఖాస్తు ఎప్పుడు చేశారనేది ముఖ్యం కాదనీ పేదరికమే అర్హతనీ, అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. పేదలకు సహాయం అందించాలన్న సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందచేస్తున్నారని వివరించారు. లబ్దిదారుల ముసుగులో అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్నదన్న సమాచారం ఉన్నదనీ, ఈ నేపథ్యంలో అర్హులకు ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆచరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఒక పాలసీని రూపొందించాలని సూచించారు నగరానికి దూరంగా 2 బీహెచ్‌కే కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్ట పడటం లేదనీ, వారి జీవనోపాథికి ఇబ్బంది కలుగుతుందని లబ్దిదారులు వెళ్లడం లేదన్నారు. తీసుకున్న ఇండ్లను అద్దెకి ఇచ్చి నగరంలోనే ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించి, వారి స్థానంలో, ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టామని చెప్పారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేదు
ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూముల ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్‌ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ సర్వేలను శాస్త్రీయ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించి భూముల స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచిం చారు. దీనిద్వారా భవిష్యత్తులో వివాదాలకు తెరపడుతుందన్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాలు నిర్మిస్తున్నామనీ, ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నామనీ, వాటికి అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్లకు సూచిం చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ పథకం చాలా అద్భుతంగా అమలవుతున్నదని చెప్పారు. దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్‌ పెట్టాలని సూచించారు. మంజూరైన ప్రతి ఇల్లు గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్‌ లోకేశ్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్యదర్శి విపి గౌతం తదితర ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.

రూఫ్‌ టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం
హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో 30 కెవి ఉత్పాదక సామర్ధ్యంతో నెలకొల్పిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా నెలకు సుమారు 4500 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ భవనంలో వినియోగించే విద్యుత్‌లో ఈ మేరకు ఆదా అవుతుందని ఎండీ విపి గౌతం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -