రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత దాచురి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపం లో “రాజకీయ క్రీడలో విద్యారంగం- పెరుగుతున్న అసమానతలు” అనే అంశంపై రామిరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని పిల్లలందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందించే బాధ్యతనుండి తప్పించుకోవాలని చూస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను సాధ్యమైనంత త్వరగా మూసేసి కార్పొరేట్ వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, నూతన విద్యా విధానం 20-20 పేరుతో ప్రస్తుతం ఉన్న విద్య విధానాన్ని తికమకపరిచి మార్కెట్ అవసరాల కొరకే విద్యా విధానం ఉపయోగపడే విధంగా కార్పొరేట్ల లాభాల కోసం విద్య ఉండే విధంగా ఉమ్మడి జాబితాలో ఉండే విద్యారంగాన్ని కేంద్రమే పూర్తి ఆధిపత్యంతో కేంద్రీకరించడం జరుగుతుందన్నారు. ఇది సమంజసం కాదని, దేశంలో ప్రతి పిల్లవానికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వాలు నూతన విద్యా విధానం, సనాతన ధర్మం పేరుతో కార్పొరేట్ సేవ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. విద్యారంగంలో టీచర్ల సంఖ్యను తగ్గించి టెక్నాలజీ పేరుతో ఉపాధ్యాయుడు లేని విద్యా విధానం తీసుకువచ్చే నూతన పోకడలు ప్రమాదకరమని, గత 15 సంవత్సరాల కాలంలో దేశంలో 2 కోట్ల పాఠశాలలు మూసివేశారని తద్వారా పిల్లలందరికీ చదువులు చెప్పించే బాధ్యత నుండి తప్పుకుంటున్నారని ప్రభుత్వాలను నిలదీశారు . బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 20వేల మంది రెగ్యులర్ టీచర్లను
తొలగించి కేవలం 7000 జీతంతో లక్ష మందికి పైగా కాంట్రాక్ట్ టీచర్లను కొనసాగిస్తున్న దుస్థితి ఉన్నదని తెలిపారు, అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ నివేదిక కూడా సూచనలు చేసిందని ఉపాధ్యాయుల నియామకాలు తాత్కాలిక పద్ధతిలో ఉండాలని సూచించడం అత్యంత అన్యాయమైన చర్య అని అన్నారు.
టీచర్ల స్థానాన్ని తక్కువ చేసి చూడడం వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకు వస్తున్నారని, పాఠ్యపుస్తకాల్లో వాస్తవ చరిత్ర ను తొలగించి వలసవాద ఆలోచన
పద్ధతులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం సరైనది కాదని అన్నారు. ఇండియాలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని మరుగునపరిచి మత చాంధసత్వాన్ని పెంచడానికి పరమత సహనం, దేశభక్తి లేకుండా చేయడానికి, అసమానతలు పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒక నివేదిక ప్రకారం బ్రిటిష్ వారి కాలం కంటే ఇప్పుడే దేశంలో అసమానతలు పెరిగాయని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్లకు అవకాశాన్ని వేగవతం చేసి కార్పొరేట్ విద్యను పెంపొందించాలని నీతి అయోగ్ సూచించడం విద్యా రంగంలో ప్రమాదగంటికలు మోగినవి అనడానికి సూచనగా ఉందని అన్నారు.
అదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు అరకొర సౌకర్యాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు 96% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, విద్యారంగ కేంద్రీకరణ , వ్యాపారీకరణ మరియు కాషాయకరణ విధానాలను తిప్పి కొట్టడానికి ఉపాధ్యాయ లోకం ఐక్యం కావాలని, ప్రభుత్వం తీసుకు వస్తున్న అప్రజా సామిక విధానాన్ని తప్పి కొట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీఎస్ యుటిఎఫ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సంక్షేమ పథకం మూడవ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్రంలోని 58 మంది ఉపాధ్యాయులు మరణించగా ఒక్కొక్కరికి ఆరు లక్షల చొప్పున ఆ కుటుంబాలకు మూడు కోట్ల పైచిలుకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శాంతి కుమారి, వెంకటేశం, సోమయ్య, జ్ఞాన మంజరి, వైశాలి, సత్యానంద్, రవికుమార్, యాకయ్య,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు గుండమనేని మహేందర్ రావు,జంగిటి
రాజు లు తదితరులు పాల్గొన్నారు.



