Saturday, May 2, 2026
E-PAPER
Homeకరీంనగర్కడ"చూపు"..కన్నీటి "వీడ్కోలు"

కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు”

- Advertisement -

కన్నీటి సంద్రమైన సిరిసిల్ల
సిరిసిల్లకు ఓఆర్ఆర్ యాక్సిడెంట్ మృత దేహాలు
వరుసగా ఆరు మృతదేహాల అంతిమయాత్ర
ఒకే చితిలో ముగ్గురి దహనసంస్కారాలు
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల

భగవంతుడా ?.. ఆ కుటుంబానికి ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా ??… ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురిని ఆ కుటుంబానికి దూరం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందయ్యా ???… ఐదు వైకుంఠరథాలపై ఆరుగురి మృతదేహాలు సిరిసిల్ల విద్యానగర్ వైకుంఠధామం వైపు అంతమయాత్రగా ఉద్విగ్న భరిత వాతావరణంలో సాగుతుంటే పట్టణ ప్రజల గుండె లోతుల్లోంచి… మౌనంగా  వెలువడిన ప్రశ్నలు ఇవి. ఎంతటి పాశవిక హృదయాలైనా అంతిమయాత్రను చూస్తే బరువెక్కిన గుండెలతో కన్నీటి పర్యంతం కావలసిందే. సిరిసిల్ల పట్టణంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సిరిసిల్లను దుఃఖ సాగరంలో నింపింది…
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై శుక్రవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం యావత్ తెలంగాణను కన్నీరు పెట్టించింది. దైవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఔటర్ రింగురోడ్డులో జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాలకు కడుపుకోత మిగిలించింది. శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుండి ఢీ కొట్టిన ఘటనలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బొల్లి రాజు-భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు శివకుమార్, కోడలు లాస్య, మనవరాలు రిషిత, అల్లుడు కోడం శ్రీనివాస్, మనవలు కోడం కృష్ణచంద్ర, మాధవ్ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు కోడం శ్వేత కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పోస్టుమార్టం అనంతరం ఆరు మృతదేహాలను  స్వస్థలం సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు తీసుకువచ్చారు.

కన్నీటి సంద్రంలా సిరిసిల్ల..
ప్రమాదంలో ముగ్గురు ముక్కు పచ్చలారని చిన్నారులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతదేహాల వద్ద గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులను చూసి సిరిసిల్ల పట్టణం కన్నీటి సంద్రంలా మారింది.  పట్టణంలో ఐదు వైకుంఠ రథాలలో ఆరు మృతదేహాల అంతిమయాత్ర చూసి, పట్టణవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్రలో అన్ని పార్టీల నాయకులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని భావాతప్త హృదయంతో అంతిమ వీడ్కోలు పలికారు.

ఒకే చితిలో ముగ్గురి దహనసంస్కారాలు..
పట్టణంలోని విద్యానగర్ స్మశాన వాటికలో  రెండు చితులను ఏర్పాటు చేయగా, ఒక్కొక్క చితిలో ముగ్గురి అంత్యక్రియలు జరపడం అందరి మనసులను కలిచివేసింది. మృతుడు కోడం శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు కోడం కృష్ణచంద్ర, కోడం మాధవ్ ల చితికి శ్రీనివాస్ తల్లి మల్లవ్వ నిప్పంటించడం అంత్యక్రియలలో పాల్గొన్న ప్రతిఒక్కరి హృదయాలను దుఃఖ సంద్రంలోని నింపింది. తాను కాలం చెల్లితే తలకొరివి పెట్టాల్సిన కొడుకు చితికి తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి కోడం శ్రీనివాస్ తల్లి మల్లవ్వకు ఏర్పడింది. నేత కార్మిక కుటుంబానికి చెందిన మల్లవ భర్త రామచంద్రం 10 ఏళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. దాంతో పిల్లల పోషణ భారం మల్లవ పై పడింది. ఆమె మొదటి నుంచి కష్టాలకు ఎదురీదుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. నలుగురు కూతుళ్ళ వివాహం చేయడంతో పాటు కుమారుడి వివాహం కూడా చేసింది. కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని అనుకొని కష్టాల కడలి నుంచి బయటపడుతున్నానని కొంత సంతోషంగా ఉంటున్న సమయంలో ఆ తల్లికి తీరని వేదన ఎదురయింది. కన్న కొడుకు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి విగత జీవిలా తన ముందుకు వచ్చేసరికి ఆ కన్నతల్లి గుండె బద్దలయింది. తన చితికి నిప్పు పెడతాడు అనుకున్న కుమారుని చితికి నిప్పు పెట్టె దౌర్భాగ్య పరిస్థితి నాకు ఎందుకు కల్పించావు దేవుడా.. అంటూ ఆమె విలపించిన తీరు మానవతావాదులందరినీ దుఃఖసాగరంలో ముంచింది. కొడుకు శివకుమార్, కోడలు లాస్య, మనవరాలు రిషిత చితికి బొల్లి రాజు నిప్పంటించాడు. కాగా ఒకే చితిలో మూడు మృతదేహాలను ఉంచి దహన సంస్కారాలు జరపడంతో అక్కడున్న ప్రతి ఒక్కరు గుండెలవిసేలా విలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -