మా డిగ్రీరోజుల్లో మిత్రుల్లో ఎవరైనా నాకు కోపమొస్తే మనిషినికాను అనంటే కోపం రాకపోయిని నీవు మనిషివి కావులే అని డైలాగ్ వదిలేవాళ్లం. అలాగే ట్రంపులవారు నేను ఇక మంచివాడిగా ఉండబోనని ఓ మాటనేశాడు. అంటే ఇంతవరకు నిన్ను నీవు మంచివాడిననుకుంటున్నావా అధ్యక్షా అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చూస్తే ఎవ్వరూ ఏమీ అనలేదు. అంటే మంచివాడు అనుకునేటప్పుడే ఇలాగుంటే ఇక కానప్పుడు ఎలాగుంటాడన్న అనుమానం, భయం ఉండివుండవచ్చు. ఐతే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం నీవు, నీ మిత్రుడు నెతన్యాహు మంచోళ్లో చెడ్డోళ్లో నాకనవసరం కాని ఫలానా దేశాలపై మీరు దాడి చేస్తే అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది జర భద్రంగుండండని మాత్రం హెచ్చరించాడు.
ఇక యుద్ధాల్లో ఎంతెంత మంది చనిపోతున్నారో లెక్కేలేకుండా పోతోంది. గాజా లెక్కలు, ఇరాన్ లెక్కలు చూస్తే కంట్లో నీల్లోస్తాయి. ఇరాన్ ముఖ్య నాయకులు, చీఫులు, అధికారులు ఎందరు చనిపోయినా లెక్కలేదు కాని ఒక్క అమెరికన్ సైనికుడు చనిపోతే మాత్రం పెద్ద రభస చేస్తారు. యుద్ధం చేస్తున్న మిత్రుల్లో ఒక ముసలాయనకేమో తొంభై దాటగా, ఇంకొకరికి డెబ్భై దాటాయి. వాళ్లపై ఈగ కూడా వాలదు కాని మిగతా అన్నిచోట్లా ప్రాణాలు ప్రాణాలే కావు. ప్రాణం ఖరీదు దేశాన్నిబట్టి, మతాన్ని, జాతినిబట్టి ఉంటుందని అధ్యక్షులవారి మాటల్లో తెలిసిపోతోంది. ఎక్కడైనా ఆదిమానవులు మిగిలుంటే ఈ ఆధునిక మానవుల్ని చూపించి వాళ్లు చేస్తున్న పనుల గురించి చెబితే సిగ్గుపడతారు. తామే మానవత్వంగలవారమని అనుకుంటారు కూడా.
ట్రంపులవారు, సతీమణి, వాళ్ల ఉపాధ్యక్షులు ఒక హోటల్లో విందులో ఉన్నారు. ప్రపంచమంతా ఎల్నినో ఎండల్లో ఉడికిపోతోంది, యుద్ధం మంటల్లో మండుతున్న ఈ సమయంలో పార్టీలేమిటని గట్టిగా అనరాదు. రోము నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడని చెబుతారు. అప్పటికి ఫిడేలనే వాయిద్యమే లేదు లైర్ అనే వాయిద్యాన్ని వాడి పాటలు పాడుతున్నాడు, ప్రజల్ని కాపాడడానికి తన రాజభవనాన్ని తెరిచాడని, ఇదంతా అతని శత్రువులు సెనేటర్ల దుష్ప్రచారమని కొందరు చరిత్రకారులు తరువాత చెప్పారు. దుష్యంతుడు కూడా శకుంతలను, కొడుకును నాకు తెలియదని అబద్ధమాడితే కాళిదాసులవారు రాజును కాపాడడంకోసం శాపాన్ని సృష్టించి కాపాడతాడు. ఈ కవులు, చరిత్రకారులు ఎప్పుడూ అంతే. అసలు విషయానికొస్తే అధ్యక్షులవారి బృందం పైన దాడికి ఒకరు ప్రయత్నించారు. అందరమూ ఖండించాము, ఖండించాలి కూడా.
కొసమెరుపేమంటే తరువాత అధ్యక్షులవారు ఇచ్చిన ఒక ప్రకటన. ఒక మతం ప్రస్తావన. దీన్ని కొందరు మాత్రమే వ్యతిరేకించారు. అసలు ఆ దాడి జరిగినప్పుడు నేను అదే హోటల్లో బసచేసి ఉన్నానని రెవరెండ్ కె.ఎ.పాల్ గారు తరువాత వార్త వదిలారు. దాన్ని అధ్యక్షులవారితో పాటు ఎవ్వరూ పెద్ద సీరియస్సుగా తీసుకోలేదు. తానక్కడ ఉన్నందుకే ట్రంపులవారు క్షేమంగా బయటపడ్డారని ఆయన అంటాడేమోనని నేనైతే అనుకున్నాను. కాని అనలేదు.
సరే ఆ హోటల్లో కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షులవారి ప్రాణాన్ని కాపాడిన ప్రత్యేక రక్షణ వలయానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు ట్రంపులవారు. తెగమెచ్చుకున్నాడు. వెంటనే అతణ్ణి కూచోబెట్టి, అలాగే మోకాళ్లపైన నడిపించి, ముందుకు తీసుకుపోయి ఆ ప్రమాదస్థలాన్నుండి దూరంగా తీసుకుపోయారు. మొత్తం మీద ప్రాణభిక్షపెట్టారు. నాకెందుకో ట్రంపులవారిని ఒక ప్రశ్న అడగాలనిపించింది, ప్రాణం విలువ ఏమిటో ఇప్పుడు తెలిసిందా అధ్యక్షా అని. దుండగుడు చేసింది నూటికి నూరుశాతం తప్పు. కాని ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి ఒక్కొక్కరు ఒకవిధంగా ఆలోచిస్తారు, అంటారు కదా. అదే సమయానికి ఒక డాక్టరు, ఒక న్యాయవాది, ఒక న్యాయమూర్తి, ఒక ఆచార్యుడు, ఒక శాస్త్రజ్ఞుడు, ఒక రాజకీయనాయకుడు, ఒక పత్రికా సంపాదకుడు, ఒక సైన్యాధ్యక్షుడు ఇలా రకరకాలవాళ్లుంటే రకరకాలుగా ఆట్లాడేవాళ్లని కొన్ని కథల్లో చదువుకున్నాం, విన్నాం. ఒక్కొక్కరూ ఒక విధంగా తీసుకుంటారు, తీర్మానిస్తారు.
ఇదంతా జరిగాక పెద్దాయన వెంటనే బయటకొచ్చి నాకిప్పుడు ప్రాణం విలువ తెలిసింది. బతికియుండిన సుఖములుబడయవచ్చునని మిత్రలాభంలో చదివాను. నేను చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు తెప్పించుకొని మరీ ఇంగ్లీషులో చూశాను, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి నేను నా మిత్రుడు నెతన్యాహు ఇద్దరం మాట్లాడుకున్నాము ఏదేశం పౌరులైనా, ఏ కులం, మతం వాళ్లైనా వాళ్లదీ ప్రాణమే. జాతి హననం కూడా తప్పు. అసలు ఒక సంస్కృతిని లేకుండా చేస్తానన్న నా మాటలు విరమించుకుంటున్నాను. నిజంగానే ఇక యుద్ధాలు జరగవు. నేను నిజంగానే వాటిని ఆపుతున్నాను. ఇకపై ప్రపంచం ప్రశాంతంగా, శాంతిగా ఉంటుంది. ప్రపంచ ప్రజలందరికీ ఇది శుభవార్త అని ముగించాడు. అరే నేనన్న మాటలు పెద్దాయనకెలా తెలిశాయబ్బా అని నాకు తెగ ఆశ్చర్యమేసింది.
ఆగిపోయింది, యుద్ధమాగిపోయింది. పెద్దాయనకు ప్రాణం ఖరీదు తెలిసొచ్చింది. ఇక ప్రపంచానికి మంచి దినాలు మొదలైనాయి. జై ట్రంపులవారు, జై జై ట్రంపులవారు మొహం మీద నా శ్రీమతి నీళ్లుపోస్తేగాని నాకొచ్చింది కల అని తెలియలేదు.
“నీకేమైనా పిచ్చా, వెర్రా? ట్రంపులవారు మారారంటావ్, వార్తలు చూద్దువురా, ఇరాన్ పై ఇతర దేశాలపై పెద్దాయన అంటున్న వార్తలు విందువు. పళ్లు తోముకొని చాయ్ తాగు. మొదట కలలోనుండి బయటకు రా….”
“ఐతే ప్రాణం ఖరీదు?”
“యూ ట్యూబులో వేసుకొని చూద్దువులే, లెయ్యింక…
జంధ్యాల రఘఘుబాబు 9849753298
ప్రాణం ఖరీదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



