Tuesday, May 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతుల కన్నెర్ర

రైతుల కన్నెర్ర

- Advertisement -

మక్కలు, ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ఆగ్రహం
అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్న పంటలు

ఖమ్మంలో రైతు సంఘాల భారీ ర్యాలీ
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్‌ నుంచి నూతన కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌ దివాకర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్య క్షులు దొండపాటి రమేష్‌, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్‌, బీఆర్‌ఎస్‌ రైతు విభాగం జిల్లా నాయకులు బంకా మల్లయ్య మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేర్లు ఉన్నప్పటికీ మార్క్‌ఫెడ్‌ జాబితాలో కనిపించకపోవడం, కౌలు రైతుల నమోదు లోపించడం వల్ల కొనుగోలు ప్రక్రియ మందగిస్తున్న దని తెలిపారు. ఖమ్మం, మద్దులపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్లలో మొక్కజొన్న బస్తాల దిగుమతికి అనుమతి ఇవ్వాలని, రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా బస్తాలను తరలించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల కారణంగా పంట తడవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, పట్టాలు సరఫరా చేయాలని కోరారు.

చేర్యాలలో రాస్తారోకో
కొనుగోళ్లను వేగవంతం చేయాలని.. గోనె సంచుల కొరత తీర్చాలంటూ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ ఎదుట జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యం, మొక్కజొన్నలు 15 రోజులైనా అమ్ముకునే పరిస్థితి లేదని, గోనె సంచుల కొరత, లారీలు రాక కొనుగోళ్లు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం

రోజుల తరబడి కాంటాలు పెట్టడం లేదనీ, కాంటాలు వేసిన ధాన్యం, మక్కల బస్తాలను తరలించడానికి లారీలు రావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పంటలు తడిసి తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో, మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు ప్రధాన కూడలి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు, ఆర్డీవో రావాలని, సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. సమాచారం తెలుసుకున్న గూడూరు సీఐ వినరుకుమార్‌, ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు, ఆర్డీవోతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆ తర్వాత రైతులను కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. అలాగే, రోజుల తరబడి మార్కెట్లోనే మక్కల రాశులతో వేచి చూస్తున్నామని, కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని మార్కెట్‌ ఎదుట రైతులు బస్తాలేసి ధర్నా చేపట్టారు. గాలి దుమారాలు, తేలికపాటి వర్షాలకు తడిసినా కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టార్ఫాలిన్లు సైతం అందుబాటులో లేవని తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ మహేందర్‌, ఇతర పోలీసులు అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు చేపట్టేలా చూస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

ధాన్యం కొనుగోలు చేయాలి
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలో రైతులు తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బైటాయించారు. నెలలు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తూకం వేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ కృష్ణ హామీనిచ్చారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేశారు. దీంతో ఎస్‌ఐ రాము అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రహదారులపై ధర్నా నిర్వహించడం పట్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు.

గన్ని సంచులు, వసతులు కరువు
కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, పరిమితి లేకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిరునోముల రైతులు ఆందోళనకు దిగారు. బోనకల్‌-ఖమ్మం ప్రధాన రహదారిపై చిరునోముల క్రాస్‌ రోడ్‌ వద్ద ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. చిరునోముల గ్రామంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా 20 రోజులుగా మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, కాంటా వేసిన పంటను గోదాములకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఎకరానికి 26 క్వింటాళ్ల పరిమితి విధించడం వల్ల మిగిలిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎడ్లబండ్లతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నిమ్మతోట రవి పెట్రోల్‌ బాటిల్‌ తెచ్చుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న బోనకల్‌ ఎస్‌ఐ పొదిలి వెంకన్న ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. తహసీల్దార్‌ మద్దెల రమాదేవి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

తహసీల్దార్‌ చాంబర్‌లో రైతుల నిరసన

వరి ధాన్యం లారీలను రైస్‌ మిల్లర్లు అన్‌లోడ్‌ చేయటం లేదని, రోజుల తరబడి లారీలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయం ముందు, తహసీల్దార్‌ జెకె.మోహన్‌ చాంబర్‌లో జూరాల రైతులు బైటాయించారు.

పూడూరులో బీఆర్‌ఎస్‌ ధర్నా
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. కరీంనగర్‌ – జగిత్యాల ప్రధాన జాతీయ రహదారిపై ధాన్యం పోసి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్‌ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకూర్చున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొడిమ్యాల తహసీల్దార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుల డిమాండ్‌ మేరకు ఎటువంటి ఆంక్షలూ లేకుండా, 43 కిలోలకు బదులుగా 40 కిలోల తూకంతోనే ధాన్యం కొనుగోలు చేస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -