ఆరేండ్లుగా అడ్రస్ లేని సమావేశాలు
మూతపడుతున్న పరిశ్రమలు
కనుమరుగవుతున్న పథకాలు
ఇంజినీరింగ్ విభాగంలో
నిధుల ‘గోల్‌మాల్’
అధికారుల పర్యవేక్షణ శూన్యం
నవతెలంగాణ -ఏటూరునాగారం ఐటీడీఏ
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన ఐటీడీఏ(గిరిజన అభివృద్ధి సంస్థ) లక్ష్యం నీరుగారిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీనతతో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయి. నిధుల ఖర్చుపై జవాబుదారీతనం కొరవడింది. స్వయం ఉపాధి, ఉపాధి శిక్షణా కేంద్రాలు, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి.
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో 2019 డిసెంబర్ 19న చివరి పాలకమండలి సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్లీ సమావేశాలు జరిగిన దాఖలాలు లేవు. ఆ తర్వాత వచ్చిన పీవోలు ఎవరూ పాలకమండలి నిర్వహణపై దృష్టి సారించలేదు. ఇప్పటికీ ఆరేండ్లు కావస్తున్నా ‘పాలక’ పత్తా లేకపోవడంతో నిధుల వినియోగంపై జవాబుదారీతనం కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి సీతక్క.. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు దాటుతున్నా, ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు పీవోలు మారినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాల్సిన చిన్న తరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. అంగన్వాడీలకు, హాస్టళ్లకు సరఫరా చేసే పౌష్టికాహార తయారీ కేంద్రం రెండేండ్ల కిందటే మూతపడింది. షాపల్లి గ్రామంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ కేంద్రం నిధుల లేమితో నిలిచిపోయింది. శిక్షణ ఇచ్చే వారు లేక మూత్ ట్రైనింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి..!
ఐటీడీఏలో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ విభాగం అవినీతికి నిలయంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. పీవోలు, కలెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఈఈ, డీఈ, ఏఈలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేయని పనులకు బిల్లులు డ్రా చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు నిర్మించిన కొద్ది కాలానికే శిథిలావస్థకు చేరుతుండటం అధికారుల ‘కమీషన్ల’ కక్కుర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. 2023లో 9 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటల కోసం కేటాయించిన రూ.24లక్షలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. క్షేత్రస్థాయిలో తోటలు లేవు కానీ, నిధులు మాత్రం మాయమయ్యాయి.
ఉత్సవ విగ్రహాల్లా పీఓలు..
ఐటీడీఏ పీవోలు కేవలం కుర్చీలకే పరిమితమై ఉత్సవ విగ్రహాల్లా మారుతున్నారు. ఆరేండ్లుగా పాలక మండలి లేకపోవడం ఆదివాసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతిపై విచారణ జరిపి, తక్షణమే పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలి.
-పూసమ్ సచిన్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



