దళిత సంఘాల ఆగ్రహం
ఎస్సై సస్పెన్షన్ కు డిమాండ్
నవతెలంగాణ-కాటారం
కాటారం మండలంలో పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఒక దళిత యువకుడిపై ఎస్సై దాడి చేశారన్న ఆరోపణలు వెలువడడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. దళిత బంధు క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గద్దల శంకర్ మాట్లాడుతూ, ప్రజా పాలన పేరుతో దళితులపై దౌర్జన్యాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ఉండాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
మంథని డివిజన్ దళిత నాయకుడు ఊట్ల శ్రీను మాట్లాడుతూ, రామిల్ల రాజు తమ్ముడు అంజిని కాటారం ఎస్సై తీవ్రంగా కొట్టారన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచాల్సింది పోయి, రూమ్‌లో పెట్టి లాఠీలతో కొట్టడం ఏ విధమైన విధి నిర్వహణ అని ప్రశ్నించారు.
“భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి,” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై వెంటనే కాటారం ఎస్సై ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు .



