Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత యువకుడిపై థర్డ్ డిగ్రీ 

దళిత యువకుడిపై థర్డ్ డిగ్రీ 

- Advertisement -

జాతీయ ఎస్సీ కమిషన్, హెచ్‌ఆర్‌సీ, డీజీపీకి ఫిర్యాదులు
నవతెలంగాణ-కాటారం 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడు రామిల్ల అంజిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు రామిల్ల రాజబాపు జాతీయ ఎస్సీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ (HRC), రాష్ట్ర డీజీపీ కార్యాలయాలకు నేరుగా వెళ్లి ఫిర్యాదులు అందజేసినట్లు గురువారం తెలిపారు. రాజబాపు వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ రాత్రి ఒక కేసు విచారణ పేరుతో అంజిని కాటారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై , కానిస్టేబుల్ అతనిపై అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. బట్టలు విప్పించి తీవ్రంగా కొట్టడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ, బలవంతంగా కాళ్లు మొక్కించుకున్నారని పేర్కొన్నారు.

దాడి తీవ్రత కారణంగా అంజి నడవలేని స్థితికి చేరుకోవడంతో స్థానిక మాదాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్యులు శరీరంపై అనేక చోట్ల లాఠీ దెబ్బల మచ్చలు ఉన్నట్లు నిర్ధారించారని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజబాపు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్‌లోని జాతీయ సంస్థలను ఆశ్రయించి పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు అందజేసినట్లు తెలిపారు.

ఫిర్యాదుతో పాటు పోలీసుల సంభాషణలకు సంబంధించిన వాయిస్ రికార్డులు, దాడికి సంబంధించి తమ వద్ద ఉన్న సాక్ష్యాలను సీడీ, పెన్‌డ్రైవ్ రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని రామిల్ల రాజబాపు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -