Saturday, May 9, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో వీడని సస్పెన్స్‌!

తమిళనాడులో వీడని సస్పెన్స్‌!

- Advertisement -

కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తొలగని అనిశ్చితి.. అనేక నాటకీయ పరిణామాలు
గవర్నర్‌ ‌రాజేంద్ర అర్లీకర్‌‌తో టీవీకే చీఫ్‌ ‌విజయ్‌ సమావేశం..120 మంది సభ్యుల సంఖ్యా బలాన్ని చూపెట్టిన దళపతి
మద్దతు పలికిన వామపక్షాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడని అధికారిక ప్రకటన..
మద్దతు లేఖ ఇచ్చిన వీసీకే.. ధృవీకరించని లోక్‌‌భవన్‌
టీవీకేకు హ్యాండిచ్చిన ఐయూఎంఎల్‌..రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

ఇండియా కూటమికి గుడ్‌బై
డీఎంకే సంచలన నిర్ణయం

కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తొలగని అనిశ్చితి.. రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

చెన్నై : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ ‌వీడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌ ‌నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు అనేక రూపాల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలంటూ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌‌ను కలిసిన విజయ్‌‌కు.. లోక్‌‌భవన్‌ ‌నుంచి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌లభించలేదు. ఇక శుక్రవారం సాయంత్రం టీవీకే అధినేత మూడోసారి గవర్నర్‌‌ను కలిశారు. తమకు 120 మంది సభ్యుల బలం ఉందని గవర్నర్‌‌కు విజయ్‌ ‌వివరించినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌.. విజయ్‌‌ని ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. అలాగే సీఎంగా విజయ్‌ ‌శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్‌ ‌కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది. ​విజయ్‌‌ టీవీకేకు అప్పటి వరకు మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయూఎంఎల్‌‌ల తీరుతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. వీసీకే అధికారికంగా మద్దతు లేఖను అందించలేదు. మధ్యాహ్నం వరకు.. టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఐయూఎంఎల్‌ సాయంత్రం వరకు తన మద్దతను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఐయూఎంఎల్‌ ఒక ప్రకటనను సైతం విడుదల చేసింది. ఫలితగా టీవీకే బలం 116కు పడిపోయినట్టయ్యింది. అయితే ఈ కారణంగానే గవర్నర్‌ ‌కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. దీంతో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

టీవీకేకు మద్దతు లేఖ మెయిల్‌ ‌చేసిన వీసీకే
అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీసీకే.. టీవీకేకు ఈమెయిల్‌ ‌ద్వారా మద్దతు లేఖను పంపింది. ఈ విషయాన్ని వీసీకే ట్వీట్‌ ‌ద్వరా తెలియజేసింది. కాగా వీసీకే, ఐయూఎంఎల్‌‌లకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.

విజయ్‌ ‌ప్రమాణస్వీకారంపై అనిశ్చితి
శుక్రవారం సాయంత్రం మారిన పరిస్థితుల నడుమ సీఎంగా విజయ్‌ ‌ప్రమాణస్వీకారంపై మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు విజయ్‌ ‌ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికీ విజయ్‌ ‌టీవీకే పార్టీ మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకం ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు.

ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజకీయ అనిశ్చితి
ఈనెల 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలు కలిగి ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్‌ ‌ఫిగర్‌ 118 స్థానాలను దక్కించుకోవాలి. అయితే ఫలితాల్లో ఏ ఒక్క పార్టీ కూడా మ్యాజిక్‌ ‌ఫిగర్‌‌ను అందుకోలేక పోయింది. విజయ్‌ ‌టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించి.. మ్యాజిక్‌ ‌ఫిగర్‌‌కు 10 స్థానాల దూరంలో ఆగిపోయింది. డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్‌ ఐదు స్థానాలు, పీఎంకే నాలుగు, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్‌, వీసీకే లు రెండు స్థానాల చొప్పున, బీజేపీ, డీఎండీకే, అమ్మ మక్కల్‌ ‌మున్నేట్ర కజగంలు ఒక్క సీటు చొప్పున గెలుచుకున్నాయి.

గవర్నర్‌‌ను ఇప్పటికే రెండు సార్లు కలిసిన విజయ్‌
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇందుకు లోక్‌‌భవన్‌ ‌బ్రేకులు వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలంటూ టీవీకే అధినేత విజయ్‌ ఇప్పటికే బుధ, గురు వారాల్లో రెండు సార్లు తమిళనాడు గవర్నర్‌‌ రాజేంద్ర అర్లీకర్‌ను కలిశారు. కానీ స్పష్టమైన మెజారిటీ 118 స్థానాలు లేవనే కారణంతో గవర్నర్‌ రెండు సార్లు కూడా విజయ్‌ ‌ప్రతిపాదనను తిరస్కరించారు.

డీఎంకే-అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వంపై ఊహాగానాలు
ఒకానొక సమయంలో తమిళనాడులో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీని దూరం పెడితే తాము బయటి నుంచి అన్నాడీఎంకేకు మద్దతు తెలుపుతామని కొందరు డీఎంకే నేతలు కూడా ప్రతిపాదించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ కూటమి ఏర్పాటుపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను డీఎంకే తోసిపుచ్చింది.

విజయ్‌‌కి మద్దతు తెలుపుతున్న పార్టీలు
విజయ్‌‌ టీవీకేకు కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకేకు మద్దతు తెలిపాయి. మొదటగా మద్దతు తెలిపిన పార్టీ కాంగ్రెస్‌. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ ‌పార్టీ టీవీకేకు మద్దతు తెలపడంతో బలం 113కు చేరింది. తాజాగా మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్‌ ఇవ్వడంతో అది మ్యాజిక్‌ ‌ఫిగర్‌‌ను చేరినట్టయ్యింది. డీఎంకేతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ.. ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తోంది. కాగా కొత్తగా ఏర్పడనున్న విజయ్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వంలో మద్దతు ఇస్తున్న పార్టీలకు కూడా క్యాబినెట్‌ ‌బెర్త్‌‌లు దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇందులో వామపక్ష‍ాలకు రెండు, వీసికేకు ఒక స్థానం దక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బయటనుంచే మద్దతు : వామపక్షాలు
​చెన్నైలో సంయుక్త పత్రికా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండ్యన్‌‌ మాట్లాడుతూ… టీవీకేకు మద్దతునివ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. టీవీకే మంత్రివర్గంలో తాము చేరబోవడం లేదని తెలిపారు. బయటనుంచే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సంక్ష‍ోభ నివారణకు, గవర్నర్‌‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఆడుతున్న నాటకానికి తెరదించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మతోన్మాద శక్తులను వ్యతిరేకిస్తూ, తమిళనాడు హక్కులను పరిరక్షిస్తూ సాగించే పోరాటాల్లో డీఎంకేతో కలిసి తాము ముందుకు సాగుతామని అన్నారు.

​కృతజ్ఞతలు తెలిపిన విజయ్‌
​వామపక్షాలు మద్దతు ప్రకటించిన వెంటనే విజయ్‌ ‌సీపీఐ(ఎం), సీపీఐ కార్యాలయాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సవాళ్లతో కూడిన ఇటువంటి పరిస్థితుల్లో మద్దతు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞుడిని అంటూ విజయ్‌ తెలిపారని సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు కె.బాలకృష్ణన్‌ ‌చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మతోన్మాద శక్తులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారన్నారు. తమిళనాడులో సుస్థిరమైన, లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసమే టీవీకేకు మద్దతునిచ్చామని సీపీఐ తెలియజేసింది.

​గవర్నర్‌ ‌తీరుపై విమర్శలు
తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ రాజేంద్ర అర్లీకర్‌ ఆహ్వానించకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కేంద్రం.. గవర్నర్‌ ‌పదవిని అడ్డం పెట్టుకొని మరోసారి అనైతిక రాజకీయాలకు తెర లేపిందనే విమర్శలను పలువురు రాజకీయ నాయకులు విమర్శించారు. విజయ్‌‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్‌‌ చేశారు.

గవర్నర్‌ ‌తీరు రాజ్యాంగ విరుద్ధం
ఆయన తీరును వ్యతిరేకిస్తున్నాం
విజయ్‌‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీపీఐ(ఎం) విజ్ఞప్తి

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్‌ ‌రాజేంద్ర అర్లీకర్‌ ‌తీరుపై సీపీఐ(ఎం) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. విజయ్‌‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా జాప్యం చేస్తున్న తీరును విమర్శించింది. ఎలాంటి జాప్యం లేకుండా టీవీకే నేత విజయ్‌‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని తమిళనాడు గవర్నర్‌ ‌రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లీకర్‌‌ను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి కోరారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఏకైక పార్టీ అయిన టీవీకేను.. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆహ్వానించడంలో గవర్నర్‌ ‌జాప్యం చేయడం సమర్థనీయం కాదనీ, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగ సాంప్రదాయం ప్రకారం అతిపెద్ద పార్టీ నాయకుడితో ప్రమాణస్వీకారం చేయించి, ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని చెప్పారు. 1996లో వాజ్‌‌పేయికి 13 రోజుల సమయం ఇచ్చారనీ, చివరికి ఆయన ప్రభుత్వం కూలిపోయిందని ఆయన గుర్తు చేశారు. గవర్నర్‌ ‌తీరును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -