రూ.200 కోట్లతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
ఈఎస్‌ఐ ఆస్పత్రులు,డిస్పెన్సరీల్లో మెరుగైన సౌకర్యాలు: కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, .కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రూ.200 కోట్ల వ్యయంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్‌టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, కంటి వైద్యానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మెడికల్ కళాశాలలో పీజీ సీట్లను కేటాయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 104 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతూ వైద్య సేవలు మరింత విస్తరిస్తున్నామన్నారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఈఎస్‌ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలు ఈఎస్‌ఐ వైద్య సేవలపై ఆధారపడుతున్నాయనీ, ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఇటీవల ఆర్‌సీపురం ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా కొన్ని ప్రత్యేక వైద్య సేవలు లేకపోవడంతో రోగులు సనత్‌నగర్‌కు వెళ్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆర్‌సీ పురంలో అన్ని ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో ఆర్‌సీ పురం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాదిలో కార్డియాలజీ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. శంషాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కార్య్రకమంలో ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌లు వనిత సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.


