కాలుష్యరహితంగా ఔటర్ లోపలి ప్రాంతం
సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ మెగా సోలార్ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ–చేవెళ్ల, షాబాద్
ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల మాన్యుఫాక్చరింగ్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. వాటి తరలింపులో భాగంగా ఓఆర్‌ఆర్ బయట ఆయా పరిశ్రమలకు భూముల్ని కేటాయిస్తామన్నారు. అదే సమయంలో ఆయా పారిశ్రామిక అవసరాల కోసం యువతరానికి వివిధ రకాల వృత్తి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. దానికోసమే ఏటీసీలు, పాలిటెక్నికల్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ వంటి వాటిని అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యం, మూసీ నది కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, అందుకే ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్లలోఏని కోర్ అర్బన్ ప్రాంతాన్ని పూర్తి కాలుష్యరహితంగా అభివృద్ధి చేయడం తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి గురువారంనాడాయన ప్రారంభించారు. అనంతరం ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’తో పాటు సోలార్ మాడ్యూల్స్ తయారీ విభాగాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో తొలి పరిశ్రమగా ప్రీమియర్ ఎనర్జీస్ కేవలం 12 నెలల్లో యూనిట్‌ను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడం అభినందనీయమనన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన సోలార్ ఆధారిత ‘ఆక్సీట్రీ’ సాంకేతికత అభినందనీయమని కొనియాడారు. ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో సుమారు 1.35 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ వంటి వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, డైరెక్టర్ సుధీర్ మూల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి, ప్రభుత్వ అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


