ఈ ఏడాది చివరికి మిగతా పనులు పూర్తి
అందుకు నిధులు మంజూరు చేస్తాం
ఆస్పత్రి సందర్శనలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా
నవతెలంగాణ-బీబీనగర్
దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు బీబీనగర్ ఎయిమ్స్ వైద్య సేవలో మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ఎయిమ్స్ అకాడమీ బ్లాక్ వద్ద మంత్రికి డైరెక్టర్ అమిత్ అగర్వాల్ తోపాటు స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్ లో అభివృద్ధి పనులపై అధికారులతో నడ్డా సమీక్షించారు. భవనాలను పరిశీలించారు. వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికి ఎయిమ్స్‌లో మిగతా పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశవ్యాప్తంగా 19 ఎయిమ్స్ ఆస్పత్రులు మంజూరు చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్ ఆస్పత్రులు ఉండగా, నేటికీ 18 ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. వాటిలో వైద్య సేవలు కూడా అందిస్తున్నారని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభించిన నాటి నుంచి రోజూ1800 మంది రోగులకు ఓపి సేవలు అందిస్తోందని వివరించారు. వివిధ ప్రాంతాల్లో సుమారు 540 హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యపట్ల అవగాహన కల్పించారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్. లక్ష్మణ్, డాక్టర్. డికె.అరుణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్, ఎయిమ్స్ ఎంఎస్ ఓ మహేశ్వర్ రెడ్డి, ఎన్ సీసీ అధికారులు ఉన్నారు.
దక్షిణాదికి మార్గదర్శకం బీబీనగర్ ఎయిమ్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


